జగిత్యాల రూరల్, మే 23: సీఎం కప్ పోటీల్లో జగిత్యాల జిల్లా క్రీడాకారులు సత్తాచాటాలని, జగిత్యాల జిల్లాను రాష్ట్రంలోనే ముందంజలో నిలుపాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆకాంక్షించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలో జిల్లా స్థాయి సీఎం కప్ 2023 క్రీడా పోటీలను పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, కలెక్టర్ యాస్మిన్ బాషా, అడిషనల్ కలెక్టర్ మంద మకరంద్‌తో కలిసి మంగళవారం ప్రారంభించారు. మండల స్థాయిలో గెలుపొంది జిల్లాస్థాయి పోటీలకు వచ్చిన క్రీడాకారులకు మంత్రి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే సీం కేసీఆర్ సీఎం కప్‌ను నిర్వహిస్తున్నారన్నారు.
పీఈటీలు జగిత్యాల జిల్లా నుంచి కబడ్డీ, వాలీబాల్, ఇతర క్రీడల నుంచి మంచి నైపుణ్యం ఉన్న టీంలను తయారు చేయాలన్నారు. మల్లన్నపేటకు చెందిన శ్రీకాంత్, భూటాన్ దక్షిణ ఆసియా సాఫ్ట్‌బాల్ క్రీడా పోటీలకు ఎంపికయ్యారని, అలాగే నిజామాబాద్‌కు చెందిన జరీనా కిక్ బాక్సింగ్‌లో రాణించి తెలంగాణ కీర్తి ప్రతిష్టలు పెంచిందన్నారు. రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. ఎంపీ వెంకటేశ్ నేతకాని మాట్లాడుతూ, క్రీడాకారులను ప్రోత్సహించడానికే సీఎం కప్ నిర్వహిస్తున్నామని, క్రీడలతో మానసిక వికాసం, శారీరక ధారుఢ్యం పెరుగుతుందని చెప్పారు. రాష్ట్రస్థాయిలో జగిత్యాల జిల్లా క్రీడాకారులు రాణించాలన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ, గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకే సీఎం గొప్ప ఆలోచనతో రాష్ట్రంలోని 12500గ్రామ పంచాయతీలు, 131మున్సిపాలిటీలలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారని చెప్పారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులు ఒలింపిక్స్, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని, తనవంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు.
అనంతరం ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం కప్‌కు శ్రీకారం చుట్టారన్నారు. మండల కేంద్రాల్లో నిర్మించిన మినీ స్టేడియాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ఏకైక ప్రభుత్వం దేశంలో బీఆర్ఎస్ ఒక్కటేనని ఉద్ఘాటించారు. జగిత్యాల జిల్లాను మెడికల్ హబ్‌గా మార్చారని, ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి కలిగిన దేశం భారతదేశమన్నారు. ప్రయత్నమే గెలుపుకు నాంది అని, చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లో రాణించి తాము ఎంకుకున్న లక్ష్యసాధనకు పాటుపడాలన్నారు.
అనంతరం కలెక్టర్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని, రాష్ట్రస్థాయిలో జగిత్యాల జిల్లా పేరు నిలబెట్టాలన్నారు. మూడు రోజుల పాటు జరిగే పోటీల్లో జిల్లాలోని 18మండలాల నుంచి 409మంది క్రీడాకారులు పాల్గొననున్నారని తెలిపారు. కబడ్డీ బాలుర పోటీల్లో 19జట్లు, బాలికలు 9జట్లు, వాలీబాల్ బాలుర పోటీల్లో 19, బాలికలు 5జట్లు, ఖోఖో బాలుర పోటీల్లో 17, బాలికలు 5జట్లు పాల్గొననున్నాయని వివరించారు. ఈ పోటీలతో పాటు బాస్కెట్ బాల్, అథ్లెటిక్స్ తదితర పోటీలను సైతం నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం భూటాన్‌లోని దక్షిణ ఆసియా సాఫ్ట్‌బాల్ క్రీడా పోటీలకు ఎంపికైన శ్రీకాంత్‌ను సన్మానించి, బాస్కెట్ బాల్ పోటీలను ప్రారంభించారు. ఇక్కడ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ఆర్డీవో మాధురి, జడ్పీ సీఈవో రామానుజ చార్య, మున్సిపల్ ఇన్చార్జి చైర్మన్ గోలి శ్రీనివాస్, కమిషనర్ నరేష్, ఎంపీడీవోలు, ఎంపీపీలు ఉన్నారు.