World Archery | పెద్దపల్లి, ఆగస్టు 24(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన చికిత తానిపర్తి మరో మారు క్రీఢల్లో తన సత్తాను చాటారు. కెనడాలోని విన్నిపెగ్‌లో ఈ నెల 17నుంచి 24వరకు జరిగిన ‘వరల్డ్ ఆర్చరీ యూత్ చాంపియన్ షిప్’ పోటీల్లో కాంపౌండ్ అండర్ 21మహిళల విభాగంలో చికిత గోల్డ్ మెడల్ సాధించింది. రికర్, కాంపౌండ్ వ్యక్తిగత విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో అమెరికా దేశానికి చెందిన పార్క్ ఏరిన్ 136పాయింట్లతో పోటీ పడి 142పాయింట్లు సాధించి గోల్డ్ మెడల్ అందుకుంది.
భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి తర్వాత 2, 2.30గం.ల ప్రాంతంలో గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకుంది. గత మేలో జరిగిన చైనా వరల్డ్ కప్ స్టేజ్-2లో ఆర్చరీ క్రీఢాకారులు జ్యోతి సురేఖ, మధురలతో కలిసి టీం సిల్వర్ మెడల్‌ను సాధించింది. స్టేజ్-4లో వరల్డ్ నెంబర్ 1గా ఉన్న అమెరికాకు చెందిన ఆన్డ్రియ్యా బెకెరాను ఓడించి 37వ ర్యాంకును సొంతం చేసుకుంది. తాజాగా జరిగిన వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్ షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్ సొంతం చేసుకోవడంతో ఆమె దాదాపుగా 20వ ర్యాంకుకు ఎగబాకనుంది.
వచ్చే ఏడాది జరగనున్న ఏషియన్ గేమ్స్‌కు ఆమె ప్రిపేర్ కానున్నారు. ఆర్చరీ క్రీడలో వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్ షిప్‌ను కైవసం చేసుకున్న తొలి యువతిగా దేశంలో చికిత నిలిచారు. చికిత గోల్డ్ మెడల్ సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.