జగిత్యాల, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ)/ కోరుట్ల: కోరుట్ల నియోజకవర్గంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు, టౌన్ అధ్యక్షుడితో పాటు దాదాపు 200 మంది నాయకులు పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరడం బీజేపీని కుదుపేసింది. కోరుట్లలో బీజేపీ ఖాళీ అయిన పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీకి చెందిన అత్యంత కీలకమైన నాయకులు, కోరుట్ల టౌన్ అధ్యక్షుడు దాసరి రాజశేఖర్, 11వ వార్డు కౌన్సిలర్ దాసరి సునిత, 12వ వార్డు కౌన్సిలర్ అలేఖ్య, ఆమె భర్త మురళీ శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. అంతేకాకుండా, బీజేవైఎం మెట్పల్లి టౌన్ అధ్యక్షుడు పసునూరి ఆనంద్, యూసఫ్ నగర్ మాజీ సర్పంచులు శంకర్, రాజు, వార్డు సభ్యుడు జాఫర్‌తో పాటు వారి వెంట దాదాపు 200 మంది యువకులు కూడా చేరారు.
కోరుట్ల బీజేపీ కకావికలమైంది. నియోజకవర్గంలో ఆ పార్టీకి ముఖ్యమైన నాయకులు పార్టీని వీడడంతో గట్టి షాక్ తగులుతున్నది. కోరుట్ల, మెట్పల్లి టౌన్లతో పాటు పరిసర గ్రామాల్లో రాజకీయంగా పట్టున్న ఈ నాయకులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం వల్ల కోరుట్లలో బీజేపీ ఖాళీ అయినట్లయ్యిందని అంటున్నారు. ఇటీవలే కోరుట్ల మున్సిపల్ కౌన్సిలర్లు ఇద్దరు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా కోరుట్ల బీజేపీ పట్టణాధ్యక్షుడు దాసరి రాజశేఖర్ శనివారం పార్టీకి, అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఝలక్ ఇచ్చారు.
కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ అనుసరిస్తున్న ఒంటెద్దుపోకడకు నిరసనగా రాజీనామా చేసినట్లు ప్రకటించారు. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు కనీస మర్యాద కరువైందని అందుకే పార్టీకి, పదవికి రాజీనామా చేశానని చెప్పారు. శనివారం నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అయితే బీజేపీలో క్రియాశీకలంగా ఉన్న ఈ నాయకుల ప్రభావం చాలా ఎకువగా ఉంటుంది. అలాంటి వారు పార్టీ మారడం బీఆర్ఎస్కు కలిసొచ్చే అంశం.