కరీంనగర్ కలెక్టరేట్, మార్చి 5: కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్- మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో ఆయన గెలుపొందారు. రెండు రోజుల పాటు జరిగిన కౌంటింగ్ ప్రక్రియ ఆద్యంతం ఆసక్తి రేపింది. బీజేపీ-కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ‘నువ్వానేనా’ అన్నట్టుగా ఓట్లు రావడంతో చివరి వరకూ ఉత్కంఠ నెలకొంది. మండలి స్థానం పరిధిలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో పట్టభద్రుల స్థానానికి మొత్తం 2,52,029 ఓట్లు పోలయ్యాయి. అందులో 28,686 ఓట్లు చెల్లకుండా పోగా 2,23,343 చెల్లుబాటయ్యాయి.
వీటిలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 75,675, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి 70,565, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 60,419 ఓట్లు వచ్చాయి. నిబంధనల ప్రకారం మొదటి ప్రాధాన్యతలోనే గెలుపు కోసం అవసరమైన కోటా 1,11,672 ఓట్లు పొందిన అభ్యర్థిని విజేతగా ప్రకటించాలి. మొదటి ప్రాధాన్యతలో ఏ అభ్యర్థి కూడా సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు చేపట్టారు. మొత్తం 56 మంది పోటీచేయగా, రెండో ప్రాధాన్యత క్రమంలో లెక్కించేందుకు గాను 54 మందిని ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. చివరకు బీజేపీ అభ్యర్థికే అత్యధిక ఓట్లు వచ్చాయి.
గెలుపు కోటాకు అవసరమైన ఓట్లు రాకపోయినా 5వేల పై చిలుకు ఓట్ల ఆధిక్యం ఉండడంతో మూడో ప్రాధాన్యతకు వెళ్లకుండా అంజిరెడ్డి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. కాగా, రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపుపై ఎంతో ధీమాతో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి, ఊహించిన దానికి భిన్నంగా ఫలితం వెలువడడంతో భావోద్వేగానికి గురయ్యారు. కంటనీరు పెడుతూ తన అనుచరులతో కలిసి లెక్కింపు కేంద్రం నుంచి వెళ్లిపోయారు. కన్నీళ్లు పెట్టిన నరేందర్‌రెడ్డిని తన అభిమానులు సముదాయించి దగ్గరుండి బయటకు తీసుకెళ్లారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ విషయంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి మద్దతుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రచారం చేశారు. మూడు జిల్లాల్లో బహిరంగ సభలు ఏర్పాటుచేసి ప్రచారం నిర్వహించారు. తమ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేసిందంటూ చెప్పుకొచ్చారు. అన్ని వర్గాలను ఆదుకుందంటూ ఓట్లు పొందడం కోసం ఆయన ఏకరువు పెట్టారు. కానీ, ఆయన ప్రచార ప్రక్రియ ఫలించలేదు.
కాంగ్రెస్‌కు అండగా పట్టభద్రులు నిలువలేదు. ముఖ్యమంత్రి ప్రచారం చేసినా పెద్దగా ప్రయోజనం లేకపోయిందని కొంతమంది, అలాగే కాంగ్రెస్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్ల నరేందర్‌రెడ్డి ఓటమి పాలయ్యారన్న చర్చ ప్రస్తుతం పార్టీలో నడుస్తున్నది. అంతేకాదు, రేవంత్‌రెడ్డి ప్రభావం ప్రజల్లో పలుచ పడిందని చెప్పడానికి ఇదో నిదర్శనమన్న చర్చ సాగుతున్నది.
నిజానికి గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేసిన దాఖలాలు లేవు. కానీ, రేవంత్‌రెడ్డి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేశారు. అంతేకాదు, ఒక సామాజిక వర్గాన్ని ఒక తాటిపైకి తెచ్చి అభ్యర్థిని గెలిపించాలని ప్రయత్నించారు. కానీ, ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయి. దీంతో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత పెరుగుతుందని, ముఖ్యమంత్రి ప్రచారం చేసినా ఇక ముందు విజయాలు కష్టమే అన్న ప్రచారం ప్రస్తుతం జరుగుతున్నది.