కోళ్ల పరిశ్రమను మరో వైరస్ భయపెడుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూతో కుప్పలు తెప్పలుగా కోళ్లు మృతి చెందుతున్నట్టు వస్తున్న వార్తలు ఉమ్మడి జిల్లావాసులను కలవరపెడుతున్నవి. అధికారులు కూడా అప్రమత్తం కావడంతో చికెన్ ప్రియుల్లో కూడా చికెన్ తినాలా.. వద్దా..? అనే మీమాంస నెలకొంటున్నది. ఈ పరిణామాలు క్రమంగా పౌల్ట్రీ పరిశ్రమపై ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తున్నది. అయితే, జిల్లాలో ఎలాంటి వైరస్ లేదని, చికెన్, గుడ్లు తినవచ్చని,భయం వద్దని పశుసంవర్ధక అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇటు ముందస్తుగా అప్రమత్తం చేస్తూ.. పౌల్ట్రీ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
కరీంనగర్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాలను బర్డ్ ఫ్లూ వణికిస్తున్నది. అక్కడి కోళ్ల పరిశ్రమ కుదేలవుతున్నది. ఆంధ్రా సరిహద్దులోని కొన్ని తెలంగాణ జిల్లాల్లో కూడా ఈ వైరస్ సోకిందనే పుకార్లు షికార్లు చేస్తుండగా, మన రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇతర రాష్ర్టాల నుంచి వైరస్ రాకుండా కట్టడి చేసేందుకు చర్యలు తీసుకున్నది. ఇటు బాయిలర్, అటు లేయర్ కోళ్లు ఇతర ప్రాంతాల నుంచి రాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి ఉమ్మడి జిల్లాకు వచ్చే బాయిలర్ కోళ్ల రవాణా నిలిచి పోయింది. గుడ్లను కూడా ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేయడం ఆగిపోయింది. కానీ, లేనిపోని పుకార్లతో భయం వెంటాడుతున్నది. బర్డ్ ఫ్లూ లేదని అధికారులు కొట్టిపారేస్తున్నా.. జిల్లావాసులు చికెన్ తినాలంటే భయపడుతున్నారు. కోడి గుడ్లు కూడా తినేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఈ పరిణామాలు ఉమ్మడి జిల్లా పౌల్ట్రీపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని పౌల్ట్రీ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పుకార్ల షికార్లు
కోళ్లలో బ్లర్డ్ ఫ్లూ వైరస్ విజృంభిస్తున్నదని, చికెన్ తినవద్దని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. నిజానికి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో వైరస్ ప్రభావం ఉన్నా.. మన తెలంగాణలో లేదు. కానీ, పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో చికెన్ ప్రియులు భయపడుతున్నారు. వారానికి రెండు మూడు సార్లు లొట్టలేసుకొని తినే వారంతా ఇప్పుడు వెనకాముందు అవుతున్నారు. అయితే చికెన్, గుడ్లు తినవచ్చని, ఎలాంటి భయం వద్దని పశుసంవర్ధక అధికారులు చెబుతున్నా.. అపోహలు మాత్రం వీడడం లేదు. సోషల్ మీడియా ప్రచారంతో పౌల్ట్రీ పరిశ్రమ నష్టపోయే ప్రమాదముందనే ఆందోళన యజమానుల్లో వ్యక్తమవుతున్నది.
ఎప్పటి వరకు సరిపోవచ్చు?
కరీంనగర్ జిల్లాలో సుమారు 200 పౌల్ట్రీలు ఉన్నాయి. అందులో 72 లక్షల బాయిలర్, లేయర్ కోళ్లు ఉన్నాయి. ఆరు వారాలకోసారి విక్రయించే బాయిలర్ కోళ్లు ఎప్పటి వరకు జిల్లాకు సరిపోతాయనే దానిపై చర్చ నడుస్తున్నది. నిజానికి పౌల్ట్రీ రైతులు బాయిలర్ కోసం కోడి పిల్లలను తెచ్చుకుని పెంచుతారు. ఆరు వారాల తర్వాత వాటిని విక్రయిస్తారు. ప్రస్తుతం రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడంతో ఇతర రాష్ర్టాల నుంచి కోడి పిల్లలను తెచ్చుకునే పరిస్థితి లేదు. ఇప్పుడున్న కోళ్లు కొద్ది రోజుల వరకే అందుబాటులో ఉండవచ్చు. ఒకవేళ ఇతర రాష్ర్టాల్లో పరిస్థితులు మెరుగుపడకపోతే మన రాష్ట్రంలో చికెన్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశముంటుంది.
నేడు పశువైద్యాధికారుల సమావేశం
బ్లర్డ్ ఫ్లూ వైరస్ ప్రభావం ఇప్పటి వరకైతే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కనిపించడం లేదు. అయినా ప్రభుత్వం ముందు జాగ్రత్తలతో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాలు జారీ చేయగా, జిల్లాలో పశు సంవర్ధక శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఒకసారి పౌల్ట్రీ రైతులతో సమావేశం నిర్వహించారు. ఎక్కువ మంది రైతులు హాజరు కాకపోవడంతో జిల్లా పశువైద్యాధికారి వేణుగోపాల్ రావు ఆదేశాల మేరకు అధికారులే పౌల్ట్రీ రైతుల వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే రైతులకు ఫోన్లు చేసి అప్రమత్తం చేస్తున్నారు. అయితే ఈ విషయమై గురువారం కరీంనగర్‌లోని పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. కోళ్ల పరిశ్రమలను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించి ఆదేశాలు, సూచనలు చేస్తామని జిల్లా పశువైద్యాధికారి తెలిపారు. తామంతా అప్రమత్తంగా ఉన్నామని, రైతులను కూడా అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. పశువైద్యాధికారులు రైతులకు సలహాలు, సూచనలు కూడా చేస్తున్నారని చెప్పారు. కోళ్లు అసాధారణ రీతిలో చనిపోతే తమ అధికారులకు వెంటనే సమాచారం అందించాలని కోరారు.