Godavarikhani | కోల్ సిటీ, సెప్టెంబర్ 7 : పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు నియోజక వర్గంలోని మానసిక వికలాంగుల అభివృద్ధి కోసం రామగుండంలో భవిత కేంద్రంను ఏర్పాటు చేసినట్లు సమీకృత శిశు అభివృద్ధి సేవ రామగుండం బాలల అభివృద్ధి ప్రాజెక్టు అధికారి (సీడీపీఓ) ఆర్. అలేఖ్య పటేల్ తెలిపారు. ఈమేరకు గోదావరిఖని విఠల్ నగర్ లో గల ఐసీడీఎస్ యూనిట్ కార్యాలయంలో సోమవారం వివరాలు వెల్లడించారు. రామగుండం పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఆవరణలో భవిత కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకవచ్చినట్లు తెలిపారు.
బుద్ధిమాంద్యం కలిగిన 3 నుంచి 15 సంవత్సరాల వయసు గల దివ్యాంగ పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక వసతులతో, ఆట వస్తువులతో అవసరమైన ప్రేరణ కలిగించేందుకు గానూ స్పెషల్ బీఈడీ చేసిన ఇద్దరు ఉపాధ్యాయులను నియమించినట్లు తెలిపారు. మానసిక పిల్లల అభివృద్ధి మెరుగుపర్చేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్న భోజన వసతి కూడా ఉందనీ, గోదావరిఖని నుంచి రవాణా సౌకర్యం ఉచితంగా కల్పించినట్లు తెలిపారు. ఈ అవకాశంను మానసిక వికలాంగుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు గోదావరిఖని విఠల్ నగర్ లో గల ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సంప్రదించాలని ఆమె కోరారు.