కరీంనగర్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సోమవారం ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రామనామ స్మరణతో మార్మోగాయి. ఉదయం 5 గంటల నుంచే ప్రత్యేక పూజలు, యజ్ఞయాగాదులు, భజన కార్యక్రమాలు నిర్వహించగా, భక్తులతో కిటకిటలాడాయి. కాగా, ఆలయాలపై, ప్రతి ఇంటిపైనా, రహదారులపై శ్రీరాముని జెండాలు, తోరణాలు కట్టారు.
ఇంటి ప్రధాన ద్వారాల ముందు అయోధ్య ఆలయం, జైశ్రీరాం ముగ్గులు వేశారు. వాడవాడలా అన్న ప్రసాదాలు వితరణ చేశారు. ఆలయాల్లోనే కాకుండా స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, రామ భక్తులు తమ వార్డుల్లో అన్నదానం చేపట్టారు. శ్రీరాముడి పల్లకీ సేవలు, శోభాయాత్రలు నిర్వహించారు. సాయంత్రం అందరు తమ ఇళ్లల్లో జ్యోతులు వెలిగించారు.
అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను తలపై చల్లుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు రాజకీయాలకతీతంగా రామ కార్యంలో పాల్గొన్నారు. ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి భక్తులు వందలాదిగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్లలో ప్రాణప్రతిష్ఠను వీక్షించారు. ఆయాచోట్ల వేడుకల్లో ఎమ్మెల్యేలు, నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. వేములవాడ, రుద్రంగిలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, హుజూరాబాద్‌లో అంబేద్కర్ చౌరస్తా వద్ద మున్సిపల్ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం నిర్వహించగా, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, శాలిని దంపతులు పట్టువస్ర్తాలు సమర్పించారు. కాల్వశ్రీరాంపూర్ మండలం లక్ష్మీపురంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయరమణారావు హాజరై పూజలు చేశారు.
– మాజీ ఎంపీ వినోద్
బోయినపల్లి, జనవరి 22: శ్రీరాముడి కరుణ కటాక్షాలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఆకాంక్షించారు. సోమవారం బోయినల్లి మండలం నర్సింగాపూర్‌లోని శ్రీ సీతారామచంద్రాస్వామి ఆలయంలో సతీసమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి రామమందిరం నిర్మించడం గొప్ప పరిణామం అన్నారు.
మానవజాతిలో పురుషుడు ఎలా ప్రవర్తించాలో అని చెప్పడానికి రాముడు నిదర్శనమని చెప్పారు. కార్యక్రమంలో ప్రేమ్‌సాగర్‌రావు, జోగినపల్లి అజిత్ కుమార్, ఆదిత్య, సంపత్‌రావు, మాజీ సర్పంచ్ లక్ష్మీరాజం, ఉపసర్పంచ్ కావేరి, జితేందర్‌రావు, ప్రకాశ్‌రావు, కిషన్‌రావు పాల్గొన్నారు.