Yellareddypeta | ఎల్లారెడ్డిపేట, జూలై 21 : హోటల్ వద్ద, కల్లుతాగే మండువా, కూడళ్లలో డబ్బుల అవసరమున్న వారిని మధ్యవర్తితో గుర్తించి డబ్బులిచ్చి మూడు నెలల్లో దాదాపు రెట్టింపు వసూలుకు బాధితులను టార్చర్ చేస్తున్న ఘటన వెంకటాపూర్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. వడ్డీ వ్యాపారులను కట్టడి చేసేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టిపెట్టినా కొందరు యదేచ్ఛగా ఇచ్చిన డబ్బుకు మూడు నెలల్లో రెట్టింపు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. వెంకటాపూర్‌లో ఓ వ్యక్తి హోటల్ వద్ద, కూడలి వద్ద డబ్బులు అవసరమున్న వారిని గుర్తించి వారి వద్ద దావత్ తీసుకుని ఇప్పించినందుకు తనకు కొంత ఇవ్వాలని వసూలు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
ఇలా సదరు మద్యవర్తి వెంకటాపూర్‌కు చెందిన ఓ వ్యక్తికి ఓ వడ్డీ వ్యాపారి వద్ద రూ.20వేలు ఇప్పించి కమీషన్ డబ్బులు రూ.2వేలు తీసుకోగా రూ.18వేలు తీసుకుని రూ.30వేలకు అప్పు కాగితం రాయించుకున్నట్లు తెలిసింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మూడు నెలల గడువు దాటడంతో తనకు కొంత సమయం కావాలని అడిగితే వడ్డీ వ్యాపారి ససేమీరా అన్నట్లు తెలిసింది. దీంతో పాటు ఇవ్వక పోతే తమ కుటుంబం ఇంటి ముందు కూర్చుంటామని బాధితున్ని వడ్డీ వ్యాపారి బెదిరించినట్లు తెలిసింది. బాధితుడు చివరకు తీసుకున్న డబ్బులు రూ.20వేలు తీసుకోవాలని, మిగతావి తర్వాత ఇస్తామని బతిమాలుకున్నా తాను మధ్యవర్తి వద్ద వసూలు చేయించుకుంటానని అదే తీరు బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. పోలీసులు చట్టవ్యతిరేకంగా అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చి వారి ఆర్థిక స్థోమతకు మించి వడ్డీ వసూలు చేయిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. గ్రామంలో ఇంకా కొంత మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తున్నది.