పెద్దపల్లి, జూన్ 23: ‘దండం పెడుతాం సర్. ఈ ఫీజులు కట్టలేం. ప్రభుత్వం నుంచి బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీజు బకాయిలు ఇప్పించండి’ అంటూ పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్షకు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. వారి మాటల్లో.. ‘సర్ మేం ఎస్సీలం. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు మావి. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకంలో భాగంగా మా పిల్లలను రామగిరి మండలం కల్వచర్లలోని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నం.
గతేడాది నుంచి ప్రభుత్వం నుంచి బిల్లులు రావడం రాలేదని స్కూల్ యాజమాన్యం మా పిల్లలకు బుక్స్, యూనిఫాం ఇవ్వడం లేదు. గతేడాది ఫీజులు చెల్లించాలని, ప్రభుత్వం ఇస్తే తిరిగి మీ డబ్బులు మీకు ఇస్తామని పాఠశాల యాజమాన్యం అంటున్నది’ అని వాపోయారు. తాము ఫీజులు కట్టే స్థితిలో లేమని, ప్రభుత్వం నుంచి బకాయిలు వచ్చేలా చూడాలని కోరారు. అలాగే తమ పిల్లలకు ఉచిత పుస్తకాలు, యూనిఫాం ఇప్పించాలని ఈ సందర్భంగా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు.