సారంగాపూర్, మార్చి 24: ఏసీబీకి మరో అవినీతి అధికారి చిక్కారు. రోడ్ల పనుల బిల్లు చెక్కుకు లంచం డిమాండ్ చేసి అడ్డంగా దొరికారు. లంచంగా తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి మార విజయలక్ష్మిని శుక్రవారం పదివేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ వివరాలను ఏసీబీ డీఎస్పీ భద్రయ్య విలేకరులకు వివరించారు. గ్రామానికి చెందిన సర్పంచ్ ఎడమల జయ భర్త ఎడమల లక్ష్మారెడ్డి గ్రామంలోని తుర్కాశీకాలనీలో 5లక్షల సీసీ రోడ్డు పనులు చేయించారు.
అందుకు సంబంధించిన బిల్లు చెక్కును అందించాలని కార్యదర్శిని ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు. పైగా పది వేలు డిమాండ్ చేయడంతో ఈ నెల17న లక్ష్మారెడ్డి ఏసీబీని ఆశ్రయించాడు. దీనిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు నిర్ధారణ చేసుకున్నారు. శుక్రవారం ఉదయం 11గంటలకు పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి 10వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నట్లు డీఎస్పీ భద్ర య్య వివరించారు. కెమికల్ టెస్ట్ చే యగా పాజిటివ్ వ చ్చినట్లు తెలిపారు. నేరం రుజువైనందున విజయలక్ష్మిని అరెస్ట్ చేసి స్పెషల్ ఏసీబీ కోర్టు కరీంనగర్లో హాజరు పరుస్తామన్నారు.
ఎడమల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, తాను ఏడాది క్రితం తుర్కాశీ కాలనీలో ఈజీఎస్ వర్క్ 5లక్షల సీసీ రోడ్డు పనులు చేశానని, అందుకు సంబంధించిన 4.24 లక్షల బిల్లు ఫిబ్రవరిలోనే వచ్చిందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 10న పంచాయతీ కార్యాలయం నుంచి ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చిందని, బిల్లు చెక్కు కార్యదర్శి ఇవ్వకుండా 10వేలు డిమాండ్ చేసిందని తెలిపాడు. ఈ విషయమై ఏసీబీని ఆశ్రయించానని, శుక్రవారం 10వేలు కార్యదర్శికి ఇచ్చి బయటకు రాగానే ఏసీబీ అధికారులు పట్టుకున్నారని చెప్పాడు. ఏసీబీకి పట్టుబడిన విజయ లక్ష్మి మాట్లాడుతూ, తనకు ఏం తెలియదని, పదివేలు తీసుకువచ్చి నాకు ఇచ్చారని, అంతలోనే అధికారులు వచ్చి పట్టుకున్నారని చెప్పారు. తాను ఎవరిని డబ్బుల కోసం డిమాండ్ చేయలేదన్నారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ కే భద్రయ్య, ఇన్స్పెక్టర్లు తిరుపతి, రవీందర్, జాన్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.