మెరుగైన పాలనకే సమీకృత భవనంlరూ.51కోట్లతో నిర్మాణం
నిరంతరం పర్యవేక్షిస్తాం నెలకోసారి సమీక్ష నిర్వహిస్తాం
మంత్రి గంగుల కమలాకర్ నూతన కలెక్టరేట్ నిర్మాణానికి భూమి పూజ
ముకరంపుర, డిసెంబర్ 29: ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకే సమీకృత కలెక్టరేట్‌ను నిర్మిస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా ఈ కార్యాలయాలు నిలుస్తాయని పేర్కొన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో నూతనంగా నిర్మించనున్న సమీకృత కలెక్టరేట్‌కు బుధవారం కలెక్టర్ ఆర్వీ కర్ణన్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీలు భానుప్రసాద్‌రావు, కౌశిక్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ విజయ, మేయర్ వై సునీల్‌రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావుతో కలిసి భూమి పూజ చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పాలనా సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పది జిల్లాలను 33జిల్లాలుగా చేశారని పేర్కొన్నారు. చిన్న జిల్లాలతో అధికారులు అందుబాటులో ఉంటారని, తద్వార సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉంటే ప్రజలకు సకాలంలో పనులు పూర్తికావడంతో పాటు సమయం కలిసి వస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం జిల్లాకో సమీకృత కార్యాలయాన్ని నిర్మిస్తున్నదని పేర్కొన్నారు. కరీంనగర్లో కూడా ఆధునిక భవనాన్ని నిర్మిస్తున్నదన్నారు. నిర్మాణం పూర్తయితే జిల్లా అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల నమ్మకానికి అనుగుణంగా సుపరిపాలన అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్, సీపీ సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి-హరిశంకర్, కరీంనగర్ రూరల్ జడ్పీటీసీ సభ్యురాలు పీ లలిత, ఎంపీపీ టీ లక్ష్మయ్య, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ ఆర్ రాజు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్లో నూతన కలెక్టరేట్ నిర్మాణానికి రూ.51కోట్లు కేటాయించారు. సంవత్సరంలోగా కొత్త భవనం నుంచే పరిపాలన చేయాలని ఆదేశించారు. ఆ మేరకు ఏడాదిలోగా నిర్మాణం పూర్తయ్యేలా దగ్గర ఉండి పర్యవేక్షిస్తాం. నెలకోసారి సమీక్ష నిర్వహించి, పనిలో జాప్యం జరుగకుండా చూస్తాం. కొత్త భవనం జీ ప్లస్ 2గా నిర్మిస్తాం. ఇప్పుడున్న భవనం 2,69,301చదరపు అడుగులు ఉన్నది. కొత్త భవనం 2,64,062 చదరపు అడుగుల్లో నిర్మాణమవుతుంది. పాత భవనం కార్పెట్ ఏరియా 1,23,572 చదరపు అడుగులు. కొత్త భవనం 1,59,309 చదరపు అడగులు. పాత భవనం కంటే 35వేల చదరపు అడుగులు ఎక్కువగా ఉంటుంది. ఉత్తర దిశలో వాస్తు ప్రకారంగా నిర్మించే బిల్డింగ్ డిజైన్ అద్భుతంగా ఉన్నది. నగరంతో పాటు జిల్లా అభివృద్ధిలో ముందుకుసాగుతుంది.