శనివారం 26 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 24, 2020 , 01:28:23

ఖాతాల్లోకి రైతుబంధు నగదు

ఖాతాల్లోకి రైతుబంధు నగదు

l అన్నదాతకు అండగా రాష్ట్ర సర్కారు 

lవిపత్కర  పరిస్థితుల్లోనూ డబ్బులు జమ 

lఉమ్మడి జిల్లావ్యాప్తంగా 5,95,676 మందికి లబ్ధి  

lహర్షం వ్యక్తం చేస్తున్న రైతాంగం  

lసాగు పనుల్లో బిజీబిజీ 

lముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు

కరీంనగర్‌/ రాజన్న సిరిసిల్ల/ పెద్దపల్లి, నమస్తే తెలంగాణ/ జగిత్యాల టౌన్‌: కరోనా సృష్టించిన ఆర్థిక సంక్షోభంలోనూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని మరువలేదు. మూడేళ్లుగా అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని యథావిధిగా అమలు చేస్తూ తమది రైతు పక్షపాత ప్రభుత్వమని మరోసారి రుజువు చేసుకున్నది. నియంత్రిత సాగు విధానం అమల్లోకి వచ్చిన ఈ వానకాలం సీజన్‌లో రైతులు పెట్టుబడుల కోసం ఇబ్బందులు పడకూడదని భావించింది. ప్రతి రైతుకు పెట్టుబడి సహాయం అందే విధంగా చర్యలు తీసుకున్నది. కరోనా సమయంలో ఈ పథకాన్ని అమలు చేస్తారో? లేదోనని వ్యక్తమైన అనుమానాలను పటాపంచలు చేసింది. ఇప్పుడు అందిన రైతుబంధు సొమ్ముతో రైతులు తమ సాగు అవసరాలను తీర్చుకుంటున్నారు.

కరీంనగర్‌ జిల్లాలో..

కరీంనగర్‌ జిల్లాలో 1,72,877 మంది అర్హులు ఉండగా 1,60,133 మంది ఇప్పటివరకు వివరాలు అందించారు. వీరిలో ఇప్పటికే 1,56,934 మంది వివరాలను ట్రెజరీకి పంపించారు. రూ.158 కోట్ల 93 లక్షల 40 వేల 338 నగదు వారి ఖాతాల్లో జమవుతున్నది. నగదు జమైన మరు క్షణమే వారి సెల్‌ ఫోన్లకు సంక్షిప్త సమాచారం చేరుతున్నది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచే రైతులు తమ నగదును విడిపించుకుంటున్నారు. మంగళవారం ఏటీఎంలు, బ్యాంకుల్లో ఎక్కడ చూసినా రైతులు రైతుబంధు నగదును విడిపిస్తూ కనిపించారు.

పెద్దపల్లి జిల్లాలో..

జిల్లాలో 1,19,777 మంది రైతులు రైతుబంధు కింద లబ్ధి పొందనున్నారు. వీరి ఖాతాల్లో రూ.119 కోట్ల 61 లక్షల 76 వేల 833 నగదు జమ కానుంది.

జగిత్యాల జిల్లాలో..

జిల్లాలో మొత్తం 2,06,198 మంది రైతుబంధు సాయం అందుకోనున్నారు. వీరిలో రెండున్నర ఎకరాల్లోపు ఉన్నవారు 1,51,608 మంది, ఐదెకరాల్లోపు ఉన్న రైతులు 33,762 మంది, ఐదెకరాల పైన ఉన్న రైతులు 18,375 మంది ఉన్నారు. గత యాసంగిలో అర్హులైన రైతులు 1,45,277 మంది ఉన్నారు.

సిరిసిల్ల జిల్లాలో..

జిల్లాలో ఈసారి రైతుబంధు పథకం 1,12,767 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. వారి ఖాతాలో రూ.128 కోట్ల 5 లక్షలు జమ కానున్నాయి. కాగా, ఇప్పటికే 1,02,188 మంది రైతుల ఖాతాల్లో రూ.113 కోట్ల 59 లక్షల 61 వేల 695 నగదు జమైంది.

సకాలంలో పెట్టుబడి

జిల్లాలో కాళేశ్వరం నీళ్లు పుష్కలంగా ఉండడంతో రైతులు ఇప్పటికే పంటల సాగుకు ఉపక్రమిస్తున్నారు. దీనికి తోడు ఈసారి నియంత్రిత సాగు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. సీఎం కేసీఆర్‌ చూపిన మార్గంలో నడిచేందుకు రైతులు ముందుకు వచ్చారు. సన్నరకాలు సాగు చేసేందుకు ఇప్పటికే నార్లు పోసుకున్నారు. మక్క సాగు తగ్గించి పత్తి విస్తీర్ణం పెంచుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో పెట్టుబడి సహాయం అందించాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో సోమవారం నుంచి శరవేగంగా రైతుల ఖాతాల్లో నగదు జమవుతున్నది. అధికారులు ట్రెజరీకి పంపిన రైతుల్లో 90 శాతం మందికిపైగా ఈ పథకం కింద నగదు జమైనట్లు తెలుస్తున్నది.ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5,95,676 మందికి లబ్ధి చేకూరనున్నది.

రైతు ఖాతాల్లో వేగంగా జమ

సీజన్‌కు ముందే ప్రతి రైతుకు పెట్టుబడి సాయాన్ని సర్కారు అందిస్తున్నది. 2018 మే 10న కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలంలోని ఇందిరానగర్‌-శాలపల్లిలో సీఎం కేసీఆర్‌ ఈ పథకాన్ని స్వయంగా ప్రారంభించారు. అప్పటి నుంచి వానకాలం, యాసంగి సీజన్లకు ముందే రైతుల ఖాతాల్లో నగదును జమ చేస్తున్నది. మొదటి రెండు సీజన్లకు ఎకరానికి రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.8 వేలు అందించింది. గడిచిన మరో రెండు సీజన్లకు సీజన్‌కు రూ.5 వేల చొప్పున ఏటా ఎకరానికి రూ. 10 వేలు అందిస్తున్నది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో రాష్ట్రం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ సీఎం కేసీఆర్‌ సీజన్‌కు ముందే రైతులకు ఈ పథకాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ చేస్తున్నారు. దీనికి అర్హులైన వారి ఖాతాల్లో గంటకు 1.50 లక్షల నుంచి 2 లక్షల మంది ఖాతాల్లోకి ఆర్థిక శాఖ నగదును వేగంగా జమ చేస్తున్నది.

మాటతప్పని ముఖ్యమంత్రి 

విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారు రైతులకు ఇచ్చిన మాట తప్పకుండా పెట్టుబడి పైసలు వేసిండు. ఒకప్పుడు పెట్టుబడి కోసం బ్యాంకులు, వ్యాపారుల చుట్టూ అప్పుల కోసం తిరిగేది. నెల్లాళ్లూ తిరిగినా ఒక్క రూపాయీ పుట్టకపోయేది. రైతుబంధు వచ్చినంక ఆ బాధలు పోయినయ్‌. యాసంగి, వానకాలం పంటలకు టైముకు పెట్టుబడి పైసలు సర్కారే ఇస్తున్నది. నాకు 3 ఎకరాల 30 గుంటలకు రూ.18,900 ఖాతాల పడ్డయ్‌.  

- గాండ్ల లక్ష్మణ్‌, మంగళపల్లి (చొప్పదండి)

 బిజీ బిజీగా అగ్రి మార్కెట్‌.. 

రైతుబంధు కింద తమ ఖాతాల్లో జమ అవుతున్న నగదును విడిపించుకుంటున్న అన్నదాతలు సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు తమ అవసరమైన ఉత్పాదకాలను సమకూర్చుకునే పనిలో పడ్డారు. రెండు రోజులుగా విత్తన, ఎరువుల డీలర్ల దుకాణాల్లో ఎక్కడ చూసినా రైతులే కనిపిస్తున్నారు. గ్రామాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, డీసీఎంఎస్‌ కౌంటర్లు, ఇతర అగ్రి సెంటర్లు కూడా రైతుల రాకతో కిటకిటలాడుతున్నాయి. మరో పక్క ఇలాంటి సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తమకు పెట్టుబడి సహాయాన్ని అందించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  ఇంత క్లిష్ట పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ గ్రాంటును పూర్తిగా సాగు అవసరాలకే ఖర్చు చేస్తామని వారు స్పష్టం చేస్తున్నారు.

మెస్సేజ్‌ చూడంగనే సంబురమైంది

గోపరపల్లి గ్రామంలోని సర్వే నంబర్‌ 1569లో నాకు 1.32 ఎకరాల భూమి ఉంది. అందుకు నాకు రూ. 9,062 సోమవారం బ్యాంక్‌లో జమైనట్లు సెల్‌ ఫోన్‌కు మెస్సేజ్‌ వచ్చింది. ఇది చూడంగనే నాకు సంబురమైంది. సీఎం కేసీఆర్‌ సార్‌ మరోసారి మాట నిలబెట్టుకున్నడు. కరోనా జేయవట్టి పైసలేత్తరో, లేదో అనుకున్న. ఎన్ని కష్టాలున్నా మాట ప్రకారం పైసలేసిండు. సీఎం సార్‌కు రుణ పడి ఉంటం. ఆ సార్‌ జెప్పినట్టు నేను 1.32 ఎకరాల్లో సన్నరకం వరి ఏత్తన్న.    

- జంగ రాజిరెడ్డి, రైతు, గోపరపల్లి(ఓదెల)

రెండోసారి డబ్బులు తీసుకున్న..

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌. కష్టకాలంలోనూ ఆదుకుంటున్నడు.  నాకు ఎకరా10 గుంటల భూమి ఉంటే రూ.6 వేల రైతుబంధు పైసలు వచ్చినయ్‌. బ్యాంకు ఖాతాల జమైనట్లు తెలిసింది. మస్తు సంబురమైతాంది. నేను దీంతో రెండోసారి రైతుబంధు పైసలు తీసుకున్న. వానకాలం పెట్టుబడికి సరిపోతయ్‌. రైతుల పంటల గిట్టుబాటు ధర కోసం సీఎం సార్‌ జెప్పినట్లే పంటలు ఏస్తం. అధికారుల సూచన మేరకు సాగు చేసి అధిక దిగుబడి సాధిస్తం. 

-గీస రాజయ్య. కిష్టంపేట (కాల్వశ్రీరాంపూర్‌) 

రైతు బంధువు కేసీఆర్‌

సరైన సమయంలో పెట్టుబడి సాయం అందించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుబంధువైండు. కరోనా టైంల చేతిల చిల్లిగవ్వ లేక పెట్టుబడికి ఇబ్బంది పడాల్సి వస్తుందనుకున్న రైతులకు కష్టం రాకుండా అన్న మాట ప్రకారం   అందజేసి ఆదుకుంటున్నడు. నాకు ఎకరం 27 గుంటల భూమి ఉన్నది. రూ.8,375ల ఖాతాల పడ్డయ్‌. నాలాంటి ఎంతో మంది రైతులకు అండగా నిలుస్తున్న సర్కారుకు కృతజ్ఞతలు.

- వడ్లూరి ఆదిమల్లు, రైతు, ఇస్లాంపూర్‌(గంగాధర)

డబ్బుల కోసం ఆందోళన వద్దు

రైతుబంధు డబ్బులను డ్రా చేసుకునే విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సోమ, మంగళవారాల్లో స్థానికంగా నెట్‌వర్క్‌ పని చేయకపోవడంతో బ్యాంకులో తాత్కాలికంగా లావాదేవీలు నిలిచిపోయాయి. నెట్‌ వర్క్‌ పునరుద్ధరణ కాగానే బ్యాంక్‌ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. ఆంధ్రాబ్యాంక్‌ సెల్‌ నెంబర్‌ 92230 11300కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే ఖాతాలో డబ్బులు జమ అయ్యాయా?, లేదా? అనే విషయం తెలుస్తుంది. బ్యాంక్‌ పరిధిలోని సీఎస్‌పీల నుంచి రూ. 25 వేల వరకు డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. బ్యాంక్‌కు వచ్చి ఇబ్బందులు పడొద్దు. కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో సహకరించాలి.

- బద్రినాథ్‌, ఆంధ్రా బ్యాంక్‌ మేనేజర్‌ (ధర్మారం)


logo