గురువారం 04 జూన్ 2020
Karimnagar - Feb 29, 2020 , 01:33:11

కాళేశ్వరం’ పరవళ్లు

కాళేశ్వరం’ పరవళ్లు

పెద్దపల్లి ప్రతినిధి/ తిమ్మాపూర్‌, నమస్తే తెలంగాణ/ రామడుగు/ ధర్మారం/ బోయినిపల్లి : కాళేశ్వర గంగ అజేయ యాత్ర కొనసాగుతున్నది. పల్లం నుంచి ఎగువకు దిగ్విజయంగా ఎదురెక్కుతూ లక్ష్యాన్ని ముద్దాడుతున్నది. లింక్‌-1,2లో మోటర్లు నిర్విరామంగా నడుస్తుండడంతో వందల కిలోమీటర్లు దాటి తరలివస్తున్నది. దిగువన భూపాలపల్లి జిల్లాలో లక్ష్మీపంప్‌హౌస్‌లో ఎత్తిపోతలు కొనసాగుతుండగా, ఇక్కడ శుక్రవారం పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలం కాసిపేటలోని సరస్వతీ పంప్‌హౌస్‌లో 1, 2, 7 మోటర్లు నడిపారు. ఒక్కో మోటర్‌ 2900 క్యూసెక్కుల చొప్పున మొత్తం 8700 క్యూసెక్కుల నీరు మంథని మండలం సిరిపురంలోని పార్వతి బరాజ్‌లోకి చేరుతున్నది. కాగా, పార్వతి బరాజ్‌లోకి చేరుతున్న నీటిని అంతర్గాం మండలం గోలివాడలోని పార్వతి పంప్‌హౌస్‌ ద్వారా ఎగువన ఎల్లంపల్లి బరాజ్‌లోకి ఎత్తిపోస్తున్నారు. ఇక్కడ 3, 4, 5, 6 మోటర్లు నడిపిస్తుండగా, ఒక్కో మోటర్‌ ద్వారా 2610 క్యూసెక్కుల చొప్పున 10,440 క్యూసెక్కుల నీరు ఎల్లంపల్లి బరాజ్‌లోకి చేరుతున్నది. 


ఇక లింక్‌-2లో భాగంగా ధర్మారం మండలం నంది మేడారంలోని నందిపంప్‌హౌస్‌లో 3, 4 మోటర్లు నడుస్తున్నాయి. ఒక్కో మోటర్‌ ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున 6,300 క్యూసెక్కులు నంది రిజర్వాయర్‌లోకి తరలుతున్నది. ఇక్కడి నుంచి 7వ ప్యాకేజీలోని జంట సొరంగాల ద్వారా 8 ప్యాకేజీలోని కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌కు తరలుతున్నాయి. ఇక్కడ 2, 4 పంపులు 6300 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుండగా, శుక్రవారం సాయంత్రానికి 11.188 టీఎంసీల జలాలను ఎత్తిపోసినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కాగా, ఎత్తిపోతల ప్రక్రియను ప్రాజెక్టు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఈ నూనె శ్రీధర్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ఏఈఈలు శ్రీనివాస్‌, వైద సురేష్‌కుమార్‌, రమేష్‌నాయక్‌, వెంకటేష్‌, వరదకాలువ ఏఈఈ తిరుపతి, మెగా ఏజెన్సీ ప్రతినిధులు ఉన్నారు. 


ఎల్‌ఎండీకి 6,290 క్యూసెక్కులు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుంచి ఎల్‌ఎండీకి శుక్రవారం 6290 క్యూసెక్కుల నీటిని పంపించారు. ఎస్‌ఆర్‌ఆర్‌ జలాశయం రివర్స్‌ స్లూయిస్‌ ద్వారా దిగువకు నీటిని పంపుతున్నారు. జలాశయంలో 25.297 టీఎంసీల నీరు నిలువ ఉన్నది. కాగా, లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంపు హౌస్‌ నుంచి వస్తున్న నీటిని యధావిధిగా దిగువకు పంపుతున్నట్లు ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు. 


ఎల్‌ఎండీలో 11.032 టీఎంసీలు 

ఎస్సారార్‌ జలాశయం స్లూయిస్‌ నుంచి ఎల్‌ఎండీ (లోయర్‌ మానేర్‌ డ్యాం)కి ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ప్రస్తుతం ఎల్‌ఎండీ రిజర్వాయర్‌లోకి శుక్రవారం 6999 క్యూసెక్కుల నీరు 


ఇన్‌ఫ్లో రూపంగా రాగా, 5773 క్యూసెక్కుల నీరు అవుట్‌ఫ్లో రూపంలో బయటికి వెళ్లింది. ఎల్‌ఎండీలో ప్రస్తుతం 11.032 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.


logo