శనివారం 30 మే 2020
Karimnagar - Feb 26, 2020 , 03:40:48

రేండోరోజు ఉత్సవాంగ

రేండోరోజు ఉత్సవాంగ

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం కరీంనగర్‌ నగరపాలక సంస్థతో పాటు హుజూరాబాద్‌, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి పట్టణాల్లో జోరుగా సాగుతోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలను భాగస్వాములను చేస్తూ సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారం దిశగా ముందుకు కదులుతున్నారు. కరీంనగర్‌లోని 17, 40వ డివిజన్లలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వీధి లైట్ల ఏర్పాటు, తాగు నీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వంగి పోయిన విద్యుత్‌ స్తంభాలను సరిచేయాలని కొందరు మంత్రి దృష్టికి తేవడంతో వాటిని తక్షణమే సరిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతి కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందనీ, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, ప్రతి ఒక్కరికి అక్షర జ్ఞానం రావాలని మంత్రి ఆకాంక్షించారు. 


నగరంలోని 26వ డివిజన్‌లో ఎంపీ బండి సంజయ్‌, కలెక్టర్‌ శశాంక, మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతి పర్యటించారు. డివిజన్లలో చిన్న చిన్న సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఎంపీ సూచించారు. పట్టణాలు, నగరాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతిలో రాజకీయాలకతీతంగా ప్రజలందరు భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. చొప్పదండి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి పర్యటించిన కలెక్టర్‌ శశాంక పలు సమస్యలను గుర్తించి వీటి పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్తపల్లి, హుజూరాబాద్‌ పట్టణాల్లో పర్యటించిన అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌ స్థానిక వార్డుల ప్రత్యేకాధికారులతో సమావేశాలు నిర్వహించి రెండు రోజుల్లో గుర్తించిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీటికి అనుగుణంగా వార్డుల వారీగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కరీంనగర్‌ నగరపాలక సంస్థతోపాటు మిగతా మున్సిపాలిటీల్లో డివిజన్‌, వార్డు కమిటీల ఆధ్వర్యంలో పాదయాత్రలు నిర్వహించి సమస్యలు గుర్తించారు.


మురుగు కాలవలో చెత్త వేసినందుకు రూ.వెయ్యి జరిమాన 

హుజూరాబాద్‌లోని 27 వార్డు పరిధి మురుగు కాలువలో ప్లాస్టిక్‌ కవర్లు, మెడికల్‌ ఖాళీ బాక్సులను, ఇతర వ్యర్థ పదార్థాలను వేసిన ప్రైవేటు క్లీనిక్‌ యాజమాన్యానికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక రూ.వెయ్యి జరిమానా విధించారు. రోడ్లపై చెత్త వేస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించారు. logo