గురువారం 04 జూన్ 2020
Karimnagar - Feb 08, 2020 , 02:23:34

‘జన’జాతర!

‘జన’జాతర!

సమ్మక్క, సారలమ్మ గద్దెలపై కొలువుదీరడంతో శుక్రవారం జాతరలన్నీ జనసంద్రాల్లా మారాయి.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 లక్షల మందికిపైగా తల్లులను దర్శించుకోగా, ఇసుకేస్తే రాలనంత జనంతో కిక్కిరిశాయి.. ఉదయం నుంచే భక్తులు వెల్లువలా తరలివచ్చి, భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.. రేకుర్తి, కేశవపట్నంతోపాటు గోదావరిఖని, గోలివాడ, నీరుకుల్లలో గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి మరీ దర్శనం చేసుకున్నారు.. పసుపు, కుంకుమ, ఒడిబియ్యం, నిలువెత్తు బంగారం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. ‘సల్లంగ సూడు తల్లీ’ అంటూ వనదేవతలను వేడుకున్నారు.   - కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ:గద్దెలపై సమ్మక్క, సారలమ్మ కొలువుదీరడంతో భక్తులు వెల్లువలా తరలివచ్చారు. నేటి సాయంత్రం వనదేవతలు వనప్రవేశం చేయనుండగా, శుక్రవారం ఉదయం నుంచే పోటెత్తారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 50 చోట్లకుపైగా జాతరలు జరగ్గా, సుమారు 12 లక్షల మందికిపైగా దర్శించుకున్నారు. కరీంనగర్‌ జిల్లాలో 4 లక్షలకు పైగా, పెద్దపల్లి జిల్లాలో ఎనిమిది లక్షలకుపైగా, రాజన్న సిరిసిల్ల, జగిత్యాలలో 30 వేల మందికిపైగా ఉన్నారు. రేకుర్తి, కేశవపట్నంతోపాటు గోదావరిఖని, గోలివాడ, నీరుకుల్లలో గంటల తరబడి క్యూలైన్లలో వేచి మరీ తల్లులను దర్శించుకున్నారు. అంతటా ఉదయం నుంచి రాత్రి దాకా సేవలో తరించారు. వనదేవతలకు ఒడిబియ్యం, చీర, పసుపు, కుంకుమ, బంగారం (బెల్లం) సమర్పించి, పిల్లాపాపను, గొడ్డూ గోదను చల్లంగా చూడాలని వేడుకున్నారు. జాతర ప్రాంతాల్లో ఎదురుకోళ్లు, గొర్రెలు, మేకలను బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అక్కడే వంటలు చేసుకొని, సామూహిక భోజనాలు చేసి, తిరుగుపయనమయ్యారు. 

దర్శించుకున్న ప్రముఖులు.. 

మేడారంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ దంపతులు వేర్వేరుగా మొక్కులు చెల్లించుకున్నారు. అమాత్యులిద్దరూ నిలువెత్తుబంగారం సమర్పించారు. కొప్పులతో కలిసి పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల, కోరుకంటి చందర్‌ కూడా తల్లులను దర్శించుకున్నారు. ఇటు ఉమ్మడి జిల్లాలోనూ పలువురు ఎమ్మెల్యేలు వనదేవతల సేవలో తరించారు. చొప్పదండి, గంగాధర మండలం బూరుగుపల్లి, రామడుగు మండలం తిర్మలాపూర్‌లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, హుజూరాబాద్‌, జమ్మికుంట, వీణవంకలో జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, మంత్రి ఈటల సతీమణి జమున పూజలు చేశారు. సుల్తానాబాద్‌ మండలం నీరుకుల్ల, కాల్వశ్రీరాంపూర్‌ మండలం పెగడపల్లి, మీర్జంపేట, ఓదెల మండలం కొలనూర్‌ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి దర్శించుకున్నారు. గోదావరిఖని, గోలివాడల్లో అమ్మవార్లను కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, ఖనిలో రామగుండం మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌ దంపతులు మొక్కులు చెల్లించుకున్నారు. 


logo