నెల రోజుల్లోగా తెలియజేస్తే పరిష్కారానికి చర్యలు
ఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ వీ గంగాధర్
ముకరంపుర, డిసెంబర్15: అదనపు లోడు విషయమై వినియోగదారులు తమ ఫిర్యాదులను సంబంధిత సెక్షన్ ఏఈలకు తెలియజేయవచ్చని ఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ గంగాధర్ వివరించారు. అదనపు లోడ్ విషయంలో ఉన్న సందేహాలతో పాటు ఇతర అంశాలపై తన కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. శాంక్షన్ లోడ్‌కు అదనపు లోడ్ అని బిల్లు కింద నోటీసు రూపంలో తెలియజేసినట్లు తెలిపారు. ఒక వేళ అందులో పేర్కొన్న విధంగా లోడు లేదనుకుంటే వినియోగదారులు సంబంధిత సెక్ష న్ ఏఈకి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. 30రోజుల్లోగా ఫిర్యాదు చేస్తే లోడ్ ఏ విధంగా ఉందో ఏఈ తనిఖీ చేసి తదుపరి చర్యలు తీసుకుంటారని తెలిపారు. కొత్త కనెక్షన్లు ఏడు రోజుల్లోగా ఇస్తున్నట్లు చెప్పారు. ఇకపై కొత్త సర్వీసులను పూర్తి స్థాయిలో మొబైల్ యాప్ ద్వారానే ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీంతో త్వరితగతిన సర్వీసులు ఇవ్వడంతో పాటు సమయం కలిసి వస్తుందన్నారు. ఇంట్లో 6మీటర్లు ఉంటే ప్యానల్ బోర్డు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. క్షేత్ర స్థాయి సిబ్బంది సేవల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వినియోగదారులు నేరుగా ఫిర్యాదు చేస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో డీఈ రాజిరెడ్డి, ఏడీఈలు నరేందర్, సుధీర్‌కుమార్, రాజు, ఎస్‌ఏవో రాజేంద్రప్రసాద్, ఏవో అరవింద్ ఉన్నారు.