రూ.10 కోట్లతో నిర్మాణం
నేడు ప్రారంభించనున్న దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములవాడ, ఆగస్టు 10: రాజన్న సన్నిధికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం రూ.10 కోట్లతో నిర్మించిన భీమేశ్వర సదన్ వసతి గదుల సముదాయాన్ని బుధవారం రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు ప్రారంభించనున్నారు. జీప్లస్-2 అంతస్తుల్లో నిర్మించిన ఈ భవనంలో మొత్తం 60 గదులను ఏర్పాటు చేశారు. ఇందులో సెల్లార్లో 40 కార్ల పార్కింగ్ వసతి, భక్తులకు విడిది కేంద్రం, రిసెప్షన్, క్యాంటీన్‌ను ఏర్పాటు చేయనున్నారు. మొదటి అంతస్తులో 28 ఏసీ గదులు, రెండు ఏసీ సూట్లు, రెండో అంతస్తులోనూ 28 ఏసీ గదులు, రెండు ఏసీ సూట్లతో కలిపి మొత్తం 60గదులు ఉన్నాయి. ఇక వీటిని ఏసీ గది రూ.1200, సూటుకు రూ.1500 చొప్పున భక్తుల నుంచి అద్దె వసూలు చేయనున్నారు. పైఅంతస్తులోకి భక్తులు వెళ్లేందుకు లిఫ్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇకపై భక్తులకు మరో 60 వసతి గదులు అందుబాటులోకి రానున్నాయి. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అభివృద్ధి పనులను పరిశీలించడమే కాకుండా వీటీడీఏ అధికారులతో కూడా ఆలయ అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.