అలవాటుగా ప్రారంభించి.. నిత్యకృత్యమై..
సాధారణ మొక్కలతో మొదలుపెట్టి..అరుదైన జాతులను చేర్చి
పచ్చదనాన్ని పెంచి ఆహ్లాదాన్ని పంచుతున్న బిజినెస్మెన్లు
ఆదర్శంగా నిలుస్తున్న కొండల్రావు, సురేశ్
జగిత్యాల, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): వేర్వేరు వ్యాపారాల్లో స్థిరపడ్డ వారిద్దరి హాబీ మాత్రం మొక్కల పెంపకమే.. నిత్యం బిజినెస్‌లో ఎంత బిజీగా ఉన్న వారికి పచ్చదనమంటే మక్కువ ఎక్కువ..రోజువారీ పనుల్లో తలమునకలై ఉన్నా ప్రకృతి ఆరాధనపైనే ధ్యాస..ఇలా వారు ప్రతిరోజూ కొంత సమయం కేటాయిస్తూ తమ తోటల్లో సాధారణ మొక్కలు మొదలుకొని అరుదైన జాతులను ప్రాణ సమానంగా పెంచుతున్నారు..తీరొక్క వృక్షాలతో నేలతల్లిని పచ్చల హారంగా మారుస్తూ ఆదర్శంగా నిలుస్తున్న జగిత్యాలకు చెందిన హరిత ప్రేమికులు కొండల్రావు, సురేశ్‌పై ‘నమస్తే’ ప్రత్యేక కథనం..
జగిత్యాల జిల్లాకేంద్రానికి చెందిన కొండల్రావు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్థిరపడ్డాడు. నిత్యం భూక్రయ విక్రయాలు, లావాదేవీలతో కుస్తీపడుతుంటాడు. ఇదే పట్టణానికి చెందిన సురేశ్ వారసత్వంగా వచ్చిన వ్యాపారాన్ని నిర్వర్తిస్తుంటాడు. పొద్దస్తమానం ఆదాయ. వ్యయాల లెక్కలు వేసే పనుల్లో తలమునకలై ఉంటాడు. ‘పచ్చదనాన్ని పెంచి భవిష్యత్తు తరాలకు ఆస్తులతో పాటు, అహ్లాదకరమైన వాతావరణాన్ని ఇవ్వాలి’ అని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునందుకొని వీరిద్దరు హరితప్రేమికులుగా మారారు. వృత్తులు వేరైనా ప్రవృత్తిగా మొక్కల పెంపకాన్ని చేపడుతున్నారు. వృత్తిబాధ్యతల్లో నిత్యం ఎంత ఒత్తిడి, ఎన్ని ఇబ్బందులు ఉన్నా మొక్కల పెంపకాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయడంలేదు. ఉదయం నుంచి సాయంత్రంలోగా ఎంతో కొంత సమయాన్ని వెచ్చించి తమ పెరట్లోని మొక్కలను కంటికిరెప్పలా కాపాడుతున్నారు. చివరకు వృత్తికి ఇచ్చినంత ప్రాముఖ్యాన్ని ఇస్తూ అరుదైన మొక్కలను పెంచుతూ, నందన బృందావనాలను సృష్టిస్తున్నారు.
కొండల్రావు పూర్వీకులు భూస్వాములు కావడం, తోటలు, పండ్ల మొక్కలు, పూల తోటల మధ్య ఆయన బాల్యం గడువడం ఆయనపై ప్రభావాన్ని చూపింది. కాలక్రమంలో ఆస్తులు తరిగిపోయాయి. పచ్చదనం హరించుకుపోయింది. అయితే వ్యాపారాన్ని వృత్తిగా స్వీకరించిన ఆయన కొంత స్థిరపడగానే బాల్యం నుంచి తనపై ప్రభావం చూపిన పూలు. పండ్ల మొక్కలను పెంచాలని నిర్ణయించుకున్నాడు. కొండగట్టు సమీపంలోని రెండు ఎకరాల స్థలంలో బృందావనం పేరిట ఒక నందనవనాన్ని సృష్టించాడు. దేశ విదేశాల నుంచి పూలు, పండ్ల మొక్కలను తెప్పించి నాటించాడు. చెర్రి పండ్ల చెట్టు, కశ్మీర్ ఆపిల్ చెట్టు, డబ్బనిమ్మ, అన్ని కాలాల్లో కాసే మామిడి చెట్లు, అరుదుగా కనిపించే పాడవులు పూల చెట్లు కల్వపూల మొక్కలు లాంటి విభిన్నమైన రకాలను పెంచుతున్నాడు. ఎరవెల్లి సురేశ్‌కు చిన్నప్పటి నుంచి మొక్కల పెంపకం అంటే ఎంతో ఇష్టం. చల్గల్ సమీపంలో తనకున్న రెండు ఎకరాల స్థలంలో ఒక ఎకరాన్ని తోట కోసమే కేటాయించాడు. వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన పనస మొక్కలు మొదలుకొని మోసంబి మొక్కల వరకు… వెదురు నుంచి శివారాధనకు వినియోగించే బిల్వ మొక్కల వరకు అన్ని రకాల మొక్కలను నాటించాడు. ప్రస్తుతం ఏపుగా పెరిగిన మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.. చూపరులను అబ్బురస్తున్నాయి.. భవిష్యత్తులో మరింతగా తోటను అభివృద్ధి చేస్తానని చెబుతున్నాడు.