పెద్దపల్లి జంక్షన్/జ్యోతినగర్, అక్టోబర్ 8: సింగరేణి సంస్థ కోసం జరిగిన భూసేకరణ ప్రక్రియలో అర్హులైన భూనిర్వాసితులకు చట్ట ప్రకారం పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ తెలిపారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, భూ నిర్వాసితుల సమస్యలు, జాతీయ రహదారి నిర్మాణ భూ సర్వే పనులపై శుక్రవారం కలెక్టరేట్లోని తన చాం బర్లో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అంతర్గాం మండలం లింగాపూర్, రామగుండం మండలం మేడిపల్లి పరిధిలో సింగరేణి సంస్థ సేకరించిన భూములకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులకు పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 30తేదీలోగా న్యాయపరమైన సలహాలు తీసుకొని సమస్య పరిష్కారానికి కృషి చేయనున్నట్లు కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి హాజరైన అంతర్గాం జడ్పీటీసీ ఆముల నారాయణ మాట్లాడారు. లింగాపూర్, మేడిపల్లి ఎస్సీ బాధితుల ఆర్అండ్ఆర్ సమస్య మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చందర్, కలెక్టర్ సహకారంతో పరిష్కారం కానున్నట్లు వివరించారు. అనంతరం జాతీయ రహదారి నిర్మాణ భూ సర్వేపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, సర్వే పురోగతిపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంచిర్యాల – వరంగల్ వరకు నూతనంగా నిర్మిస్తున్న జాతీయ రహదారి కోసం జిల్లాలో 38 కిలో మీటర్ల మేర భూమి సేకరించాల్సి ఉందని, ఇందుకు మంథని, రామగిరి, ముత్తారం మండలాల్లోని 16 గ్రామాల పరిధిలో 493 ఎకరాలు అవసరమని, ఇప్పటి వరకు 50 శాతం వరకు సర్వే పూర్తి అయిందని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న భూ సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూ సేకరణలో సమస్యలు ఉంటే పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, మంథని ఆర్డీవో నరసింహమూర్తి, సింగరేణి, రెవెన్యూ శాఖల అధికారులు, రామగుండం 20వ డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీశ్‌కుమార్, ఎమ్మార్పీఎస్ నాయకులు ఉప్పులేటి పర్వతాలు, ప్రభావిత గ్రామాల బాధితులు సానపురి శ్రీనివాస్, మల్లేశ్, శంకర్, లింగయ్య, మాజీ సర్పంచ్ ఇరికిల్ల శంకరయ్య, కే మల్లేశ్, రవి తదితరులు ఉన్నారు.