మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ
అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ
మంథని టౌన్, ఆగస్టు 7: తెలంగాణలో దళితుల అభ్యున్నతి కోసం ‘దళిత బంధు’ పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ తెలిపారు. పట్టణంలోని దళిత వాడలో కౌన్సిలర్, అధికారులతో కలిసి ఆమె శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్థానికులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నామని, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించామని పేర్కొన్నారు. దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టడం హర్షణీయమన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టామని, ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, కౌన్సిలర్లు వీకే రవి, లింగయ్య, గర్రెపల్లి సత్యనారాయణ, నక్క నాగేంద్ర, సమ్మయ్య పాల్గొన్నారు.
రోడ్ల నిర్మాణానికి పరిశీలన
ఎలిగేడు, ఆగస్టు 7: నర్సాపూర్‌లోని దళిత వాడల్లో రోడ్ల నిర్మాణానికి పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ దేవేందర్ పరిశీలించారు. ఆయా వీధుల్లో నూతనంగా నిర్మించాల్సిన రోడ్ల కోసం దాదాపుగా రూ. 50 లక్షల నిధులు మంజూరు కోసం ప్రతిపాదనలు పంపించినట్లు సర్పంచ్ తంగెళ్ల స్వప్నకుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా అందరూ స్వచ్ఛతను పాటించాలని సూచించారు. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ గ్రామస్తులకు వివరించారు.
రామగిరి, ఆగస్టు 7: ముస్త్యాలలోని దళిత వాడల్లో రోడ్లను సర్పంచ్ రామగిరి లావణ్య ఆధ్వర్యంలో గ్రామ పాలక వర్గం పరిశీలించింది. విద్యుత్ సౌకర్యంతోపాటు సీసీ రోడ్లు, మురికి కాలువలు నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించి ఆదేశాలు జారీ చేయడంతో వారు పరిశీలించారు.
ధర్మారం/ పెద్దపల్లి కమాన్, ఆగస్టు 7: ధర్మారంతో పాటు గోపాల్రావుపేట, మల్లాపూర్, కటికెనపల్లిల్లోని దళిత వాడలను అధికారులు సందర్శించి వివరాలను నమోదు చేసుకున్నారు. ఇందులో భాగంగా దళితవాడల్లో ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, విద్యుత్ సమస్యలు, మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జయశీల, ఎంపీవో చిరంజీవి, ఈజీఎస్ ఏపీవో రవి తదితరులు ఉన్నారు.