జగిత్యాల, అక్టోబర్ 5(నమస్తే తెలంగాణ): పూల జాతరకు వేళయింది.. ముంగిళ్లలో పూదోటల పరిమళాలు వెదజల్లనున్నాయి.. ‘ఒక్కేసి వెలగపండే గౌరమ్మ.. దూరాన దోర పండే గౌరమ్మ.. ఏమేమి పువ్వొప్పునో గౌరమ్మ ఏమేమి కాయొప్పునో గౌరమ్మ.. చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ’ లాంటి పాటలతో వీధులన్నీ మార్మోగనున్నాయి. బుధవారం ఎంగిలిపూలతో ప్రారంభమయ్యే బతుకమ్మ సంబురాలు తొమ్మిది రోజుల తర్వాత సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి.
అట్టహాసంగా వేడుకలు..
కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా బతుకమ్మ సంబురాలకు దూరమైన మహిళలు ఈ యేడు వైరస్ ప్రభావం తగ్గడంతో ఈ యేడు ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా భావించే బతుకమ్మ పండుగను మహిళాలోకం పసుపు కుంకుమల సౌభాగ్యాన్ని కాపాడే పర్వదినాలుగా తొమ్మిదిరోజులు మిగతా చోట్ల, వేములవాడలో మాత్రం ఏడురోజులే జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. ప్రకృతి ప్రసాదించిన రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి, వాటిలో గుమ్మడి పువ్వులోని బొడ్డెమ్మను ప్రతిష్టిస్తుంటారు. ఈ తొమ్మిది రోజుల పాటు చిన్న బతుకమ్మలను పేర్చి సాయంత్రం వేళల్లో కూడళ్లు, ఆలయ ప్రాంగణాల్లో బతుకమ్మ ఆడుతారు. చీకటి పడిన తర్వాత గౌరీదేవికి పూజలు చేసిన అనంతరం సమీపంలోని చెరువులు, కుంటలు, వాగుల్లో నిమజ్జనం చేస్తారు.