కనుల పండువగా వేంకటేశ్వర స్వామి వివాహ వేడక
పట్టు వస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించిన వొడితల వంశస్తులు
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు
హుజూరాబాద్ రూరల్, ఫిబ్రవరి 16: హుజూరాబాద్ మండలం సింగాపూర్‌లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామి వారి కల్యాణం కనుల పండువగా జరిగింది. కల్యాణ మహోత్సవానికి ఆలయ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు-సరోజినీదేవి దంపతులు, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్-డాక్టర్ శమిత, వొడితల కిషన్‌రావు-లలిత, డాక్టర్ పవన్‌కుమార్-సుష్మిత దంపతులు హాజరై పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకువచ్చారు. ఉత్సవమూర్తులను పూలు, పట్టువస్ర్తాలతో సుందరంగా అలంకరించారు. స్వామి వారి కల్యాణాన్ని వేద పండితులు గోపీనాథాచార్యులు, చిట్యాల భరత్కుమారాచార్యులు, సంతోష్కుమార్చార్యులు, పందిళ్ల చంద్రశేఖర్ శర్మ, ఆలయ అర్చకుడు చక్రపాణీరఘునందనాచార్యులు వైభవంగా జరిపించారు. భక్తులు స్వామి వారి కల్యాణాన్ని తిలకించి పులకరించిపోయారు. అనంతరం స్వామి వారిని రథంపై ఊరేగించారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో వొడితల ప్రణవ్‌బాబు, ఇంద్రనీల్-పూజిత దంపతులు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జడ్పీచైర్‌పర్సన్ విజయ, వైస్ చైర్మన్ గోపాల్‌రావు, ఎంపీపీ ఇరుమల్ల రాణి, ఆలయ కమిటీ సభ్యులు రాంచంద్రారెడ్డి, కేతిరి గోపాల్‌రెడ్డి, తుమ్మల శ్రీరామ్‌రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.