శనివారం 04 ఏప్రిల్ 2020
Jayashankar - Jan 30, 2020 , 02:46:15

ఆధునిక సాగుతో లాభాలు

ఆధునిక సాగుతో లాభాలు

మంజూర్‌నగర్‌, జనవరి29: ఆధునిక వ్యవసాయంతోనే అధిక లాభాలు సాధించవచ్చని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని భారత్‌ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన జిల్లా ఫర్టిలైజర్స్‌ అసోసియేషన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాలో ఫర్టిలైజర్స్‌ అసోసియేషన్‌ ఏర్పడడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలోని ఫర్టిలైజర్‌ షాపుల అభివృద్ధితో పాటు రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటును అందించాలన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించే పంటలో నాణ్యత లోపిస్తే గిట్టుబాటు ధర రాకపోగా రైతు కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఉంటుందని, ఫర్టిలైజర్‌ యజమానులు నాణ్యమైన ఎరువులను రైతులకు అందించి అధిక దిగుబడి సాధించేలా సహకరించాలని కోరారు. రైతులు సంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు స్వస్తి పలికి ఆధునిక, యాంత్రిక వ్యవసాయ పద్ధతులను అవలంభించాలని సూచించారు. రైతులకు, ఫర్టిలైజర్‌ యజమానులకు అవినాభావ సంబంధం ఉందని, రైతులకు సమయానికి విత్తనాలు, ఎరువులు అందించడంతో పాటు ఆర్థిక చేయూతనిచ్చేది కూడా ఫర్టిలైజర్‌ యజమానులేనని చెప్పారు. రైతులు నాణ్యమైన దిగుబడిని పొందడంలో అందిస్తున్న సహకారం గిట్టుబాటు ధర కల్పించడంలో కూడా అందించాలని కోరారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాను విభజించిన తర్వాత జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం కల్పించడంతో అధిక ఉత్పత్తిని సాధించామన్నారు. వ్యవసాయరంగంలో గణనీయ అభివృద్ధిని సాధించడానికి యాంత్రిక శక్తిని ఉపయోగించేందుకు జిల్లాలో అవసరమైన యంత్ర సామగ్రిని అందించే పరిశ్రమలను నెలకొల్పడానికి ఆసక్తి గల వ్యాపారులు ముందుకు రావాలని కోరారు. దీనివల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. 


వ్యవసాయశాఖ ద్వారా నియమించబడ్డ వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా రైతులకు రసాయన ఎరువులపై ఎప్పడికప్పుడు అవగాహన కల్పించేందుకు ఫర్టిలైజర్‌ యజమానులు కృషి చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ పంటలను నిల్వ ఉంచేందుకు ప్రతి మండలానికి 5వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోదాంను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తుందని, త్వరలోనే అది కార్యరూపం దాల్చుతుందన్నారు. జిల్లాలో వ్యవసాయ కోఆపరేటివ్‌ సొసైటీ ఏర్పాటుకు వివిధ జిల్లాల్లోని సొసైటీలను పరిశీలిస్తున్నామని, త్వరలోనే సొసైటీని ఏర్పాటు చేసుకుందామన్నారు. నూతనంగా ఏర్పడిన అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు యాంసాని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అసోసియేషన్‌ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పడిన అసోసియేషన్‌ కార్యవర్గం ప్రమాణస్వీకారం చేసింది. అనంతరం ప్రమాణస్వీకారం చేసిన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే రమణారెడ్డితో పాటు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి, వైస్‌చైర్మన్‌ కొత్త హరిబాబు, కౌన్సిలర్లను నూతన కార్యవర్గం శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించింది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యంబాబు, జిల్లా ఫర్టిలైజర్స్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు కొల్గూరి రాజేశ్వర్‌రావు, ప్రధాన కార్యదర్శి కొంగొండ మొగిలి, కోశాధికారి తడుకల జగదీశ్వర్‌, సంయుక్త కార్యదర్శి ఒల్లాల రాంబాబు, కార్యదర్శి నర్సింహారెడ్డి, గౌరవ సలహాదారు బొమ్మ సమ్మిరెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, మండల అధ్యక్షుడు మందల రవీందర్‌రెడ్డి, నాయకులు బుర్ర రమేశ్‌, జిల్లాలోని ఫర్టిలైజర్స్‌ షాప్‌ యజమానులు పాల్గొన్నారు.


logo