నగర డివిజన్ల సామాజిక కోటా ఖరారు
బీసీలకు 20 , ఎస్సీలకు 11, ఎస్టీలకు 2
మొత్తంగా మహిళలకు 33
జనరల్ మహిళ 17, అన్ రిజర్వ్డ్ 16
వారంలో నోటిఫికేషన్.. నెలాఖరులోగా పోలింగ్!
వరంగల్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. గ్రేటర్ డివిజన్లలో సామాజిక కోటా ఖరారైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీల వారీగా డివిజన్ల సంఖ్యపై స్పష్టత వచ్చింది. ‘తెలంగాణ మున్సిపల్ చట్టం-2019’ మార్గదర్శకాల మేరకు డివిజన్లలో రిజర్వేషన్ల లెక్కలను ప్రకటిస్తూ మున్సిపల్ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పునర్విభజన అనంతరం గ్రేటర్ వరంగల్‌లో 66 డివిజన్లున్నాయి. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా 33 డివిజన్లు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. మరో 33 సీట్లలో ఆయా కేటగిరీలకు సంబంధించిన పురుషులతో పాటు మహిళలకు పోటీ చేసే అవకాశం ఉంటుంది. మొత్తం డివిజన్లలో ఎస్టీ కేటగిరీకి రెండు డివిజన్లు రిజర్వ్ అయ్యాయి. వీటిలో ఎస్టీ మహిళకు ఒకటి, ఎస్టీ జనరల్ ఒకటి చొప్పున ఉన్నాయి. ఎస్సీ కేటగిరీకి 11డివిజన్లు రిజర్వ్ అయ్యాయి. వీటిలో ఎస్సీ మహిళకు 5, ఎస్సీ జనరల్‌కు 6 చొప్పున ఖరారయ్యాయి. బీసీ కేటగిరీకి 20 రిజర్వు కాగా, పది బీసీ మహిళలకు, పది బీసీ జనరల్ కోటాలో ఉన్నాయి. 17 డివిజన్లు జనరల్ మహిళ కేటగిరీకి రిజర్వ్ అయ్యాయి. మరో 16 డివిజన్లు అన్ రిజర్వుడ్‌గా ఉన్నాయి. ఈ స్థానాల్లో అన్ని కేటగిరీల పురుషులు, మహిళలు పోటీ చేయవచ్చు. కాగా బీసీలకు 20 డివిజన్లు ఖరారు కావడంతో పాటు అన్రిజర్వ్డ్ స్థానాల్లోనూ బీసీలు పోటీ చేసే చాన్స్ ఉండడంతో వారికే మేయర్ పీఠం దక్కే అవకాశం కనిపిస్తున్నది.
డివిజన్ల వారీగా..
ఎన్నికల ప్రక్రియలో కీలకమైన రిజర్వేషన్ కోటా ఖరారు కావడంతో తదుపరి ప్రక్రియ కూడా జోరందుకున్నది. డివిజన్ల వారీగా రిజర్వేషన్ల ఖరారుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రేటర్ వరంగల్ అధికారులు డివిజన్ల వారీగా చేపట్టిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యింది. ఈ ఓటర్ల ముసాయిదా జాబితాను గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయం నోటీసు బోర్డుపై ప్రదర్శించినట్లు కమిషనర్ పమేలా సత్పతి తెలిపారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం 14న తుది జాబితా వెల్లడించనున్నారు. ఓటర్ల తుది జాబితాలోని లెక్కలను పరిగణలోకి తీసుకుని డివిజన్ల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. మొత్తం డివిజన్లలో అత్యధిక ఎస్టీ జనాభా ఉన్న రెండు డివిజన్లను ఈ కేటగిరీకి రిజర్వ్ చేస్తారు. వీటి తర్వాత అత్యధిక ఎస్సీ జనాభా ఉన్న 11 డివిజన్లను ఎస్సీ కేటగిరీకి కేటాయిస్తారు. అనంతరం బీసీ జనాభా అత్యధికంగా ఉన్న 20 డివిజన్లను ఈ కేటగిరీకి రిజర్వ్ చేస్తారు. మిగిలిన డివిజన్లలో మహిళా ఓటర్ల సంఖ్య ఆధారంగా జనరల్ మహిళలకు కేటాయిస్తారు. ఇలా డివిజన్ల వారీగా రిజర్వేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియతోపాటు అధికారులు ఎన్నికల ఏర్పాట్లు వేగంగా చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 81 మంది చొప్పున రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఈ నెల 11న హైదరాబాద్‌లో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల అధికారి రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. ఏప్రిల్ నెలాఖరులో గ్రేటర్ వరంగల్ ఎన్నికల పోలింగ్ జరగేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 15 లేదా 17న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.Jangaon 09-04-2021