ఆదివారం 29 మార్చి 2020
Jangaon - Feb 11, 2020 , 03:41:36

టీఆర్ఎస్ హవా

టీఆర్ఎస్ హవా
  • సహకార ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు
  • పల్లెల్లో వేడెక్కిన సొసైటీ రాజకీయం
  • 15న పోలింగ్‌.. అదేరోజు ఫలితాల వెల్లడి
  • 16న చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక
  • పాలకుర్తి, కళ్లెం సంఘాలు మొత్తం ఏకగ్రీవం
  • 54 టీసీలు కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు
  • కాంగ్రెస్‌కు 11, ఇండిపెండెంట్‌ ఒకరు..

జనగామ, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 10: జిల్లాలోని 14 సహకార సంఘాలకు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. మొత్తం 116 డైరెక్టర్‌ స్థానాలకు 329 అభ్యర్థులు బరిలో నిలిచారు. 14 పీఏసీఎస్‌ల పరిధిలో 66 టీసీలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో 54 స్థానాలు టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు కైవసం చేసుకోగా, కాంగ్రెస్‌ 11, ఒకటి ఇండిపెండెంట్‌ దక్కించుకున్నారు. ఎన్నికలు ఏవైనా విజయదుందుబి మోగిస్తున్న గులాబీ పార్టీ సహకార ఎన్నికల్లోనూ సత్తా చాటుతున్నది. రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్‌ తాటికొండ రాజయ్యతోపాటు ముఖ్యనేతలంతా ఎప్పటికప్పుడు తమ పరిధిలోని సొసైటీల్లో పార్టీ మద్దతుదారుల గెలుపుపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన వెంటనే అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. పార్టీలకతీతంగా పరోక్ష పద్ధతిలో జరిగే సహకార ఎన్నికల్లో జిల్లాలో చాలా డైరెక్టర్‌ (టీసీ) స్థానాల్లో గులాబీ పార్టీ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మరికొందరు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. 


14 సొసైటీల పరిధిలో మెజార్టీ స్థానాల్లో డైరెక్టర్లుగా టీఆర్‌ఎస్‌ బలపరిచిన వారే ఎన్నికై జిల్లాలోని అన్ని సహకార సంఘాలపై గులాబీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తున్నది. కాగా, ఈ నెల 15న జరిగే సహకార సమరానికి జిల్లా యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తున్నది. పోలింగ్‌ సామగ్రి, బ్యాలెట్‌ బాక్సు లు, పత్రాల ముద్రణ, పోలింగ్‌ కేంద్రాలు, ఓటరు జాబితా సిద్ధం చేసి అధికారులు, సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి చేశారు. పల్లెల్లో జరిగే సహకార పోరును ప్రశాంత వాతారణంలో ముగించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికలు సహా ఇటీవల మున్సిపల్‌ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందడంతో అధికార పార్టీ మద్దతుతో సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి నియోజకవర్గాల్లో నాయకులు, ముఖ్య కార్యకర్తల్లో పోటీ పెరిగింది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి ఊరూరా ఎన్నికల సందడి నెలకొనగా, పోలింగ్‌ సమీపిస్తున్న కొద్దీ పల్లెల్లో రాజకీయం వేడెక్కింది. ప్రతి ఓటునూ లెక్కలోకి తీసుకొని అవన్నీ తమకే పోలయ్యేలా అభ్యర్థులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. బరిలో నిలిచిన అభ్యర్థులకు పార్టీ గుర్తులు లేకపోయినా ఆయా పార్టీల మద్దతుతోనే ప్రజల్లోకి వెళ్తున్నారు. 


గ్రామాల్లో జోరందుకున్న ప్రచారం..

సహకార ఎన్నికల్లో భాగంగా ఈనెల 15న పోలింగ్‌ జరిగే గ్రామాల్లో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సంఘాల్లో సభ్యులుగా ఉండి ఉపాధి కోసం వెళ్లి వేరే ప్రాంతాల్లో ఉంటున్న రైతులను ప్రసన్నం చేసుకునేందుకు తియ్యని మాటలతో పలకరిస్తూ వారి మొబైల్‌ నంబర్లు సేకరించి యోగక్షేమాలు తెలుసుకుని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్‌ రోజు రప్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మహిళా అభ్యర్థులకు భర్తలు అన్నీ తామై నడిపిస్తున్నారు. 14 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో 51,626 మంది రైతులు ఉన్నారు. ఈనెల 15న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ నిర్వహించి అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారు.


బరిలో 329 మంది అభ్యర్థులు..

జిల్లాలోని 14 సొసైటీల పరిధిలో మొత్తం 605 అభ్యర్థులకు సోమవారం 276 మంది నామినేషన్లు ఉపసంహరించుకోగా,  66 టీసీల్లో డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 116 టీసీలకు జరిగే ఎన్నికల్లో 329 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని అదనపు జిల్లా సహకార ఎన్నికల అథారిటీ అధికారి మద్దిలేటి తెలిపారు. జనగామ మండలం చీటకోడూరు పీఏసీఎస్‌ పరిధిలో అత్యధికంగా 37 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. కళ్లెం, పాలకుర్తి పీఏసీఎస్‌ పరిధిలోని 13 టీసీలకు సింగిల్‌ నామినేషన్లు దాఖలు కావడంతో ఇక్కడ సొసైటీ సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బచ్చన్నపేట సొసైటీ పరిధిలోని 13 టీసీలకు ఆరుగురు టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు ఏకగ్రీవంగా గెలుపొందితే.. మరో ఏడు టీసీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. జనగామలో 9వ టీసీ, 11వ టీసీ, చీటకోడూరులో 3, 11 టీసీలు, బచ్చన్నపేటలో 2, 6, 8, 9, 10, 11 టీసీలు, నర్మెటలో 4, 7, 9, 10, 11, 12, 13 టీసీలు, కల్లెంలో 13 టీసీలు, నిడిగొండలో 6, 8, 12 టీసీలు, కంచనపల్లిలో 5, 10 టీసీలు, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 2, 6, 13వ టీసీలు, జఫర్‌ఘడ్‌లో 1, 2, 3, 4, 5, 6, 10, 11, 12, 13 టీసీలు, లింగాలఘనపురంలో 7, 10, 11 టీసీలు, కొడకండ్లలో 10, 13 టీసీల్లో సింగిల్‌ నామినేషన్లతో ఆ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.


logo