వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయిన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ(Zelensky) మీడియాతో మాట్లాడారు. రష్యాతో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పుతిన్‌తో జరిగే చర్చల అంశంలో తుది తేదీలు ఏమీ ఖరారు కాలేదని ఆయన అన్నారు. ట్రంప్‌తో భేటీ తర్వాత.. రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు జెలెన్స్కీ తెలిపారు. త్రైపాక్షిక మీటింగ్‌కు కూడా తాము సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వెల్లడించాడు. ఒకవేళ ద్వైపాక్షక చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్‌తో చెబితే, దానికి కూడా తాము సిద్ధంగా ఉన్నట్లు జెలెన్స్కీ తెలిపాడు. శాంతి స్థాపన కోసం ఉక్రెయిన్ ఎప్పటికీ వెనుకడుగు వేయదని ఆయన అన్నారు.
జెలెన్స్కీతో జరిగిన భేటీ గురించి వైట్‌హౌజ్ నుంచి పుతిన్‌తో మాట్లాడినట్లు ట్రంప్ చెప్పారు. మీటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపానన్నారు. అయితే పుతిన్, జెలెన్స్కీ కలిసే వేదికను ఇంకా ఖరారు చేయలేదన్నారు. ఆ సమావేశం తర్వాత త్రైపాక్షిక సమావేశం జరిగే అవకాశాలు ఉన్నాయని, ఆ మీటింగ్‌లో పుతిన్, జెలెన్స్కీతో పాటు తాను కూడా పాల్గొననున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఉక్రెయిన్ అంశంలో సెక్యూర్టీ గ్యారెంటీలను కూడా డిస్కస్ చేసినట్లు తెలిపారు.