కీవ్: జపొరిజియా న్యూక్లియర్ ప్లాంట్.. యూరోప్‌లోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ప్రస్తుతం ఆ ప్లాంట్ రష్యా దళాలు ఆధీనంలో ఉంది. అయితే ఆ ప్లాంట్‌కు మళ్లీ విద్యుత్తు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఆ ప్లాంట్ వద్ద పరిస్థితి భయానకంగా ఉందని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చీఫ్ రాఫేల్ గ్రోసి తెలిపారు. ప్రస్తుతం ఆ ప్లాంట్‌ను తాత్కాలిక డీజిల్ జనరేట్లరతో నడిపిస్తున్నారు. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం మొదలైన తర్వాత జపొరిజియా అణు కేంద్రంపై పలుమార్లు దాడి జరిగింది. అక్కడ ఉద్యోగులు మాత్రం ఉక్రెయిన్ వాసులు. కానీ ఆ ప్లాంట్ మాత్రం రష్యా సైన్యం ఆధీనంలో ఉంది.
ఆ ప్లాంట్‌కు బయట నుంచి సరఫరా నిలిచిపోవడం వల్ల .. న్యూక్లియర్ సేఫ్టీ కొంత ఆందోళన కలిగిస్తున్నట్లు ఐఏఈఏ చీఫ్ తెలిపారు. ఆ అణు కేంద్రాన్ని రక్షించుకోవాలని, ఇలాంటి పరిస్థితి కొనసాగడం కరెక్టు కాదన్నారు. కానీ రష్యా మాత్రం ప్లాంట్ గురించి మరో కామెంట్ చేసింది. జపొరిజియా ప్లాంట్ వద్ద రేడియేషన్ నార్మల్ స్థాయిలో ఉన్నట్లు టెలిగ్రామ్‌లో పోస్టు చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా అటాక్ మొదలైన తర్వాత ఏడోసారి ఆ ప్లాంట్ వద్ద బ్లాకౌట్ అయినట్లు అధికారులు చెప్పారు.