మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేవారికి చాలా క్రమశిక్షణ అవసరం. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రఖ్యాత మార్షల్ ఆర్ట్స్ ఉన్నప్పటికీ షావోలిన్ మార్షల్ ఆర్టిస్టులు వెరీ స్పెషల్. వారి క్రమశిక్షణ, టెక్నిక్, బలం సాటిలేనివి. షావోలిన్ మార్షల్ ఆర్టిస్ట్ స్థాయికి చేరుకునేందుకు చాలా ఏండ్ల కృషి అవసరం. వారు చాలా చిన్న వయస్సులోనే ప్రాక్టీస్ మొదలుపెడుతారు. 3 నుంచి 4 ఏండ్ల వయస్సు పిల్లలు అత్యంత కఠిన టెక్నిక్స్‌ను నేర్చుకుంటారు. కాగా, మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న షావోలిన్ చిన్నారుల వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోను‘స్పెషల్ టైమ్స్’ అనే యూజర్ ఫేస్బుక్లో షేర్ చేశారు. మూడు నిమిషాల నిడివిగల ఈ వీడియో చెట్టు చుట్టూ చుట్టుకొని ఉన్న పిల్లవాడితో ప్రారంభమవుతుంది. అతడు కళ్లు మూసుకుని ధ్యానం చేస్తూ ఉంటాడు. అనంతరం షావోలిన్ సన్యాసి ఒక పిల్లవాడి పైభాగాన్ని వెనుకకు సాగదీస్తున్నట్లు చూపిస్తుంది. అతడి దిగువ శరీరం నిటారుగా ఉంటుంది. శరీరం బ్యాలెన్స్, ఫ్లెక్సిబిలిటీని మెరుగుపరచడంలో సహాయపడే ఇలాంటి చాలా పద్ధతులు వీడియోలో చూపించారు. ఈ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు పిల్లలు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను ద్రవింపజేసింది.