AL Houthi: గాజాలోని హమాస్ సాయుధులు, ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. హమాస్ మిలిటెంట్స్‌ను అంతం చేసేవరకు దాడులు ఆపేది లేదని ఇజ్రాయెల్ దళాలు తేల్చి చెబుతున్నాయి. ఈ యుద్ధంలో హమాస్‌కు యెమెన్‌లోని హౌతీ సాయుధ సంస్థ సహకరిస్తోంది. ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ సేనలపై దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో యెమెన్ హౌతీ ఉద్యమ నేత మహమ్మద్ అలీ అల్ హౌతీ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘పాలస్తీనాకు యెమెన్ పొరుగు దేశం కాదు కదా..! పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌లో ఉన్న హమాస్ మిలిటెంట్స్‌కు మీరు ఎందుకు సహకరిస్తున్నారు..?’ అని హౌతీ నేత అల్ హౌతీని బీబీసీ యాంకర్ ప్రశ్నించగా.. ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో తమ ప్రమేయాన్ని అల్ హౌతీ సమర్థించుకున్నారు. అయినా తాము పాలస్తీనాకు బహిరంగంగా ఎప్పుడూ మద్దతు తెలపలేదని చెప్పారు. పాలస్తీనియన్లు వాళ్లు చేయాల్సింది చేస్తారన్నారు.
‘మైళ్ల దూరంలో ఉన్న తాము యుద్ధంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నామని మీరు ప్రశ్నిస్తున్నారు. మరె అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహుకు ఒకే ఇంట్లో ఉంటున్నారా..? నెతన్యాహు, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఒకే అంతస్తులో నివసిస్తున్నారా..? నెతన్యాహు, బ్రిటన్ ప్రధాని ఒకే భవనంలో ఉంటున్నారా..? వాళ్లు ఎందుకు ఇజ్రాయెల్‌కు సహకరిస్తున్నారు..?’ అని బీబీసీ యాంకర్‌పై అల్ హౌతీ ప్రశ్నల వర్షం కురిపించారు. బ్రిటన్‌లో పాలస్తీనాకు అనుకూలంగా మాట్లాడితే మిమ్మల్ని ఉద్యోగం తీసేస్తారా.. లేదా..? అని ప్రశ్నించారు.
ఎర్ర సముద్రంలో దాడులతో తాము ఏం సాధించలేమని అమెరికా అంటోందని, అలాంటప్పుడు ఆ దేశం తమని ఎందుకు వ్యతిరేక కూటమిగా భావిస్తోందని..? అల్ హౌతీ మండిపడ్డారు. ఇజ్రాయెల్ పోర్టుల్లో ఏం జరుగుతుందో వారే స్వయంగా చెబుతున్నారని, దాంతో తమ చర్యలు ఎంత ప్రభావితంగా ఉన్నాయో తెలుస్తుందని అన్నారు. ఎవరేం చేసినా తమ ప్రాబల్యాన్ని తిరిగి పొందాలనుకుంటున్నామని చెప్పారు. మాకు చట్టబద్దత లేదని ఎవరన్నా పట్టించుకోమన్నారు.
నిజంగానే మాకు చట్టబద్దత లేకపోతే బ్రిటన్, అమెరికా, సౌదీ అరేబియా, యుఏఈతో సహా 17 దేశాలను ఎదుర్కొనే వాళ్లం కాదని, ఈ విషయంలో మాకు యెమెన్ ప్రజలే అండగా ఉంటారని తెలిపారు. తాము ఇజ్రాయెల్ హింసాత్మక దాడులను ఎదుర్కోగలమని అన్నారు. యెమెన్‌లోని ఇరాన్ అనుబంధ హౌతీ సాయుధ గ్రూప్ నవంబర్ 19 నుంచి దాదాపు 20 కంటే ఎక్కువ నౌకలపై డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. గాజాలోని పాలస్తీనియన్లకు మద్దతుగా హౌతీలు ఈ దాడులకు తెగపడుతున్నట్లు తెలుస్తున్నది.