AP news : ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీల ఆత్మగౌరవ పరిరక్షకుడని, ఆయన నాయకత్వంలోనే బీసీలకు నిజమైన రాజకీయ, సామాజిక, ఆర్థిక సాధికారత లభించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు. అవినీతి, అక్రమాలకు సంబంధించిన కేసుల్లో చట్ట ప్రకారం.. దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకుంటుంటే వాటిని బీసీలపై కక్ష సాధింపుగా చిత్రీకరించే నైతిక హక్కు వైసీపీ నేతలకు లేదని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.
మంగళవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని అచ్చెన్నాయుడు అన్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేయలేదని, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆధారాలతో చర్యలు తీసుకుందని గుర్తుచేశారు.
కుటుంబసభ్యుల ఖాతాల్లోకి నిధులు చేరినట్లు తేలడంతో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే.. దానిని బీసీలపై కక్షగా ఎలా చెబుతారని ప్రశ్నించారు. అదేవిధంగా మద్యం కేసుల్లో దర్యాప్తు ఎదుర్కొంటున్న జోగి రమేశ్ అరెస్టును కూడా చంద్రబాబు, లోకేశ్‌కు ఆపాదించడం రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదేనని విమర్శించారు. 2019-24 మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వం బలహీన వర్గాలపై సాగించిన దమనకాండను ఆ పార్టీ నేతలు గుర్తు చేసుకోవాలని అచ్చెన్నాయుడు హితవు పలికారు.
‘నేను బీసీని కాదా..? కొల్లు రవీంద్ర, అయ్యన్నపాత్రుడు బీసీలు కారా..? వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించినందుకే మాపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారు. ఒక్క పైసా అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు చూపలేకపోయినా నన్ను 80 రోజులు జైలులో పెట్టారు. అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ ఆదేశాలతో నాపై హత్యాయత్నం కేసు పెట్టించారు. కొల్లు రవీంద్రపై హత్య కేసు, అయ్యన్నపాత్రుడిపై అత్యాచారం కేసు, యనమల రామకృష్ణుడుపై అట్రాసిటీ కేసులు పెట్టినప్పుడు బీసీలపై కక్ష గుర్తుకు రాలేదా..?’ అని అచ్చెన్నాయుడు నిలదీశారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎన్టీఆర్ స్థానిక సంస్థల్లో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే చంద్రబాబు దానిని 34 శాతానికి పెంచి బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించారని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి కుదించిందని, దీనివల్ల బీసీలు సుమారు 16 వేల రాజకీయ పదవులను కోల్పోయారని ఆరోపించారు. హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే, సుప్రీంకోర్టుకు వెళ్లకుండా బీసీలకు అన్యాయం చేసింది మీరు కాదా..? అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాకే వైసీపీ నేతలు బీసీల గురించి మాట్లాడాలని అన్నారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురాలేదని, 1994-95 నాటి పంచాయతీరాజ్ చట్టం ప్రకారమే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరిస్తూ జీవో ఇచ్చిందని అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు. బీసీలకు న్యాయం చేస్తుంటే కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, వారి హక్కుల కోసం హైకోర్టులో, అవసరమైతే సుప్రీంకోర్టులోనూ చివరి వరకు పోరాడతామని తేల్చిచెప్పారు. బీసీ రిజర్వేషన్లు ఏ ఇతర వర్గానికీ వ్యతిరేకం కాదని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదని భరోసా ఇచ్చారు.