Artificial Heart | న్యూయార్క్, డిసెంబర్ 23 : గుండె కండరాల కణాలకు పునరుత్పత్తి సామర్థ్యం లేదని ఇంతకాలం భావిస్తున్న శాస్త్రవేత్తలు ఇప్పుడు కొత్త విషయాన్ని కనుగొన్నారు. కృత్రిమ గుండె ఉన్న వారిలో గుండె కండరాల కణాల పునరుత్పత్తి జరుగుతున్నదని గుర్తించారు. కృత్రిమ గుండె కలిగిన పేషెంట్ల కణజాల నమూనాలపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ అరిజోనాలో ఉన్న సర్వర్ హార్ట్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు అధ్యయనం జరిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ‘సర్కులేషన్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. గుండెకు విశ్రాంతి అనేదే ఉండదు కాబట్టి జన్మించిన తర్వాత అది పునరుత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతుందనేది శాస్త్రవేత్తల నమ్మకం. ఈ అధ్యయనం ఈ నమ్మకాన్ని బలపరిచింది. ఇదే సమయంలో కణాల పునరుత్పత్తికి కృత్రిమ గుండె ద్వారా అవకాశం ఉన్నట్టు గుర్తించింది. కృత్రిమ గుండె కలిగిన వారిలో దాదాపు 25 శాతం మందిలో గుండె కండరాల కణాల పునరుత్పత్తి జరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. కృత్రిమ గుండె ద్వారా గుండె కండరాలకు ఒకరకమైన విశ్రాంతి లభిస్తుండటం వల్లే ఇది సాధ్యమవుతున్నట్టు భావిస్తున్నారు. మానవ గుండె కండరాల కణాలకు పునరుత్పత్తి సామర్థ్యం ఉందని చెప్పడానికి ఈ అధ్యయనం బలమైన సాక్ష్యమని సర్వర్ హార్ట్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ హెషమ్ సడెక్ తెలిపారు.
ఏటా కోట్లాది మంది మరణాలకు కారణమవుతున్న గుండె వైఫల్యానికి చికిత్స అందించేందుకు శాస్త్రవేత్తలకు ఈ అధ్యయనం ద్వారా సరికొత్త మార్గం కనిపిస్తున్నది. రీజనరేటివ్ మెడిసిన్‌కు కృత్రిమ హృదయాలు దోహదపడవచ్చని, గుండెకు స్వతాహాగా ఉండే నయం చేసుకునే సామర్థ్యాలను అర్థం చేసుకునేందుకు ఈ అధ్యయనం అవకాశం కల్పించిందని అభిప్రాయపడుతున్నారు.