వాషింగ్టన్: న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మామ్దానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తనకు కింగ్ ఛార్లెస్-3తో మాట్లాడే అవకాశం వస్తే, కోహినూర్ వజ్రాన్ని(Koh-i-Noor Diamond) తిరిగి ఇవ్వాలని కోరేవాడినన్నారు. కోహీనూర్ వజ్రాన్ని అప్పగించమని కింగ్ ఛార్లెస్‌ను ఎంకరేజ్ చేసేవాడినని ఓ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. బ్రిటీష్ చక్రవర్తి కింగ్ ఛార్లెస్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఒకవేళ కింగ్ ఛార్లెస్‌ను కలిస్తే ఏం అడుగుతారని మామ్దానీని అడిగిన సందర్భంలో ఆయన ఈ సమాధానం ఇచ్చారు. అమెరికా ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడడం గౌరవప్రదంగా ఉన్నట్లు కింగ్ ఛార్లెస్ తెలిపారు. వైట్‌హౌజ్‌లో తనకు, క్వీన్ కమిల్లాకు ట్రంప్ దంపతులు విందు ఇచ్చినట్లు ఛార్లెస్ పేర్కొన్నారు. న్యూయార్క్ సిటీలో ఉన్న 9/11 స్మారకాన్ని కింగ్ ఛార్లెస్ దంపతులు విజిట్ చేశారు. ఉగ్రవాద బాధితులకు నివాళి అర్పించారు. మన్హట్టన్లో పేద పిల్లలు, కుటుంబాలకు మద్దతు ఇస్తున్న హర్లీమ్ గ్రోన్ అర్బన్ ఫామ్స్‌ను కూడా ఛార్లెస్ విజిట్ చేశారు. అయితే 9/11 స్మారకం వద్ద కింగ్ ఛార్లెస్‌ను మామ్దానీ కలిశారు.
1849లో మహారాజా దులీప్ సింగ్ 105.6 క్యారెట్ల కోహినూర్ వజ్రాన్ని క్వీన్ విక్టోరియాకు అందజేశారు. అయితే 1937లో ఆ వజ్రాన్ని ఛార్లెస్ మాతృమూర్తి క్వీన్ ఎలిజబెత్ ధరించింది. బ్రిటన్ వద్ద ఉన్న ఆ విలువైన వజ్రాన్ని మళ్లీ స్వదేశానికి తీసుకువచ్చేందుకు వీలైనంత ప్రయత్నం చేస్తామని భారత్ పేర్కొన్న విషయం తెలిసిందే. అనేక సందర్భాల్లో బ్రిటన్‌తో భారత్ ఈ అంశాన్ని ప్రస్తావించింది. ప్రస్తుతం లండన్ టవర్‌లో కోహినూర్ వజ్రాన్ని ప్రదర్శనకు పెట్టారు.క్వీన్ ఎలిజబెత్ కిరీటంలో ఆ డైమెండ్ ఉన్నది. గతంలో అనేక మంది రాజులు ఆ వజ్రాన్ని ధరించారు. మొఘల్ చక్రవర్తులు, ఇరానీ షాలు, ఆఫ్ఘనిస్తాన్ ఎమిర్స్, సిక్కు మహారాజాలు కూడా ఈ వజ్రాన్ని ధరించారు.