న్యూఢిల్లీ: తొట్టతొలిసారి కలపతో తయారు చేసిన వుడెన్ శాటిలైట్(Wooden Satellite)ను నింగిలోకి ప్రయోగించారు. భవిష్యత్తులో చంద్రుడు, అంగారక గ్రహాలపై నిర్మించబోయే ఇండ్లకు చెక్కను వాడటానికి అనుకూలంగా ఉంటుందా లేదా అని శాస్త్రవేత్తలు స్టడీ చేయనున్నారు. జపాన్ శాస్త్రవేత్తలు ఆ కలప శాటిలైట్‌ను నిర్మించారు. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్లో నుంచి ప్రయోగించిన స్పేస్ఎక్స్ రాకెట్ ద్వారా దీన్ని నింగిలోకి పంపారు. జపాన్‌కు చెందిన క్యోటో యూనివర్సిటీ దీన్ని డెవలప్ చేసింది. దీనికి లిగ్నోశాట్ అని పేరు పెట్టారు.
లాటిన్ భాషలో కలపకు లిగ్నో అని అర్థం. ఈ చిన్న శాటిలైట్ బరువు కేవలం 900 గ్రాములే. స్పేస్ఎక్స్ డ్రాగన్ కార్గో క్యాప్సూల్ ద్వారా లిగ్నోశాట్ .. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు చేరుకున్నది. భూమి కన్నా అంతరిక్షంలోనే కలప ఎక్కువ కాలం మన్నికగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అక్కడ నీళ్లు, ఆక్సిజన్ ఉండదు కనుక, అది క్షీణించడం కానీ, అంటుకోవడం కానీ ఉండదని భావిస్తున్నారు.
1900 ఆరంభంలో విమానాలను వుడ్‌తో చేశారని, వుడెన్ శాటిలైట్ కోసం ప్రయోగం చేపట్టామని క్యోటో వర్సిటీ ప్రొఫెసర్ కోజి మురాటా తెలిపారు. మంగోలియాకు చెందిన హోనోకీ అనే వృక్ష కలపతో లిగ్నోశాట్ ప్యానళ్లను తయారు చేశారు. అయితే జపాన్ సంప్రదాయ టెక్నిక్‌తో శాటిలైట్‌ను బాక్సులా తయారు చేశారు. ఆ బాక్సుకు కొన్ని స్క్రూలు, అల్యూమినయం భాగాలు, ఎలక్ట్రినిక్ వస్తువులను జోడించారు. ఆర్నెళ్ల పాటు లిగ్నోశాట్ .. కక్ష్యలో ఉంటుంది. చాలా భిన్నమైన వాతావరణాన్ని ఆ కలప శాటిలైట్ ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి.