ఐరాస, నవంబర్ 15: ప్రపంచం మంగళవారం 800వ కోట్ల శిశువుకు స్వాగతం పలికింది. దీంతో ఈ చారిత్రాత్మకమైన కొత్త మైలురాయితో ప్రపంచ జనాభా 800 కోట్లు దాటిందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. 1974లో 400 కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా 48 ఏండ్లకు రెట్టింపై నేడు 800 కోట్లకు చేరుకొన్నది. ప్రస్తుతానికి ప్రపంచ జనాభాలో చైనా, భారత్ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. వచ్చే ఏడాదికి చైనాను భారత్ దాటేస్తుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్(యూఎన్ఎఫ్పీఏ) అంచనా వేసింది. చివరి 100 కోట్ల జనాభాలో భారత్లోనే 17.7 కోట్ల జనాభా పెరుగుదల నమోదైందని తెలిపింది. వైద్యం, విద్య తదితర రంగాల్లో మానవాళి సాధించిన పురోగతి కారణంగా మరణాలు తగ్గి.. సగటు ఆయుర్దాయం పెరిగిందని, ఫలితంగా జనాభా పెరిగిందని పేర్కొన్నది.