World Census | ప్రపంచం అంతా నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నది. ఈ శుభ సందర్భంలో అమెరికా 2022 జనవరి ఒకటో తేదీ నాటికి ప్రపంచ జనాభాపై అమెరికా సెన్సస్ బ్యూరో ఆసక్తికర గణాంకాలు బయటపెట్టింది. శనివారానికి ప్రపంచ జనాభా 786 కోట్ల మార్క్‌ను దాటేసిందని అంచనా వేసింది. 2021లో ప్రపంచ జనాభా భారీగా పెరిగిందనిపేర్కొంది. కొత్తగా 7.4 కోట్ల జనాభా పెరిగిందని తెలిపింది. అమెరికా జనాభా 33,24,03,650గా ఉంటుందని పేర్కొంది. 2021లో అమెరికా జనాభా 7,06,899 (0.21%) పెరుగుదల నమోదైనట్టు తెలిపింది. అమెరికా జాతీయ జనాభా దినోత్సవం ప్రకారం ఆ దేశ జనాభా 0.29 శాతం అంటే 9,54,369 మంది పెరిగారని ఆ అధ్యయనంలో పేర్కొంది.
2022 జనవరిలో ప్రతి 9 సెకన్లకు కొత్త శిశువు జన్మించనున్నదని, ప్రతి 11 సెకండ్లకు ఒకరు మరణిస్తారని అమెరికా సెన్సస్ బ్యూరో భావిస్తున్నది. దీనికి తోడు వివిధ దేశాల నుంచి వలస రావడం ద్వారా ప్రతి 130 సెకండ్లకు అమెరికా జనాభాలో మరొకరు జత కలుస్తారని పేర్కొంది. అయితే, ప్రపంచ వ్యాప్తంగా సంభవించే జనన మరణాలు, వలసలతో అమెరికా జనాభాలో ప్రతి 40 సెకన్లకు ఒకరు చేరుతున్నారని వివరించింది. 2022 జనవరి 1 నాటికి ప్రపంచ జనాభా 786,88,72,451గా ఉంటుందని అంచనా వేసింది. 2021 జనవరి 1 నుంచి 7,42,35,487 జనాభా పెరిగినట్టు తెలిపింది.