కీవ్: రష్యా ఆక్రమణతో ఉక్రెయిన్లో భారీ విధ్వంసం జరిగింది. బిల్డింగ్లు, మౌళిక సదుపాయాలన్నీ ఆ దేశం కోల్పోయింది. అయితే ఆ భౌతిక నష్టం సుమారు 60 బిలియన్ల డాలర్లు ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ప్రస్తుతం యుద్ధం సమయంలో ధరలు మరింత పెరిగాయని, దానికి ప్రకారం ఆర్థిక నష్టం మరింత ఎక్కువే ఉంటుందని భావిస్తున్నారు. యుద్ధం కొనసాగుతున్నా కొద్దీ.. నష్టం విలువ పెరుగుతూనే ఉంటుందని వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పాస్ తెలిపారు.
తీవ్రమైన ఆర్థిక నష్టం నుంచి కోలుకునేందుకు ప్రతి నెల ఏడు బిలియన్ల డాలర్లు అవసరం ఉంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్డోమిర్ జెలెన్స్కీ తెలిపారు. దేశం మొత్తాన్ని పునర్ నిర్మించాలంటే వందల బిలియన్ల డాలర్లు అవసరం ఉంటుందని ఆయన అన్నారు. రష్యా ఆస్తులను సీజ్ చేసిన దేశాలు ఆ డబ్బును ఉక్రెయిన్ పునర్ నిర్మాణం కోసం వాడాలని సూచన చేశారు. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ కాన్ఫరెన్స్లో వీడియో లింక్ ద్వారా మాట్లాడుతూ జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు.