టెల్ అవీవ్: తమ అణు స్థావరాలపై అమెరికా దాడులు నిర్వహించిన కొన్ని గంటల తర్వాత ఇజ్రాయెల్‌పై ఇరాన్ భీకర దాడులకు దిగింది. ఆదివారం ఉదయం సెంట్రల్, ఉత్తర ఇజ్రాయెల్ లక్ష్యంగా తొలిసారిగా బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. 30కి పైగా క్షిపణులతో ఇజ్రాయెల్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ దాడుల్లో 86 మంది గాయపడినట్టు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. టెల్ అవీవ్, హైపా, నెస్ జియోనా, రిషన్ లిజియన్ ప్రాంతాలపై ఈ దాడులు జరిగాయి.
దాడులతో టెల్ అవీవ్‌లోని పలు భవనాలు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లు దెబ్బతిన్నాయి. ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. రోడ్లపై వాహనాలు ఎక్కడబడితే అక్కడ చెల్లాచెదురుగా ఉన్నాయి. పెద్దయెత్తున పేలుళ్లు సంభవించాయని, పలు చోట తీవ్ర ఆస్తి నష్టం సంభవించిందని స్థానిక మీడియా తెలిపింది. ఇరాన్ క్షిపణి దాడులతో పలు నగరాలలో పెద్దయెత్తున సైరన్ మోతలు విన్పించాయి. క్షిపణి దాడులతో టెల్ అవీవ్‌లోని ఒక షాపింగ్ సెంటర్, బ్యాంక్, సెలూన్ ధ్వంసం కావడాన్ని చూశామని, పలు షాపులు దెబ్బతిన్నాయని, పగిలిన అద్దాలు, ధ్వంసమైన భవనాలతో అంతా అస్తవ్యస్తంగా ఉందని స్థానికులు కొందరు తెలిపారు. భద్రతా దళాలు స్థానికులను అప్రమత్తం చేయడానికి ప్రయత్నిస్తుండగా, ఎర్త్మూవర్లు శిథిలాలను తొలగిస్తున్న దృశ్యాలు కన్పించాయి.
ఇరాన్ ప్రయోగించిన 30 బాలిస్టిక్ క్షిపణులలో 10 లక్ష్యాలను ఛేదించాయి. తాము బెన్ గురియన్ విమానాశ్రయం, బయోలాజికల్ రిసెర్చి సెంటర్, ఆల్టర్నేటీవ్ కమాండ్, కంట్రోల్ సెంటర్లు లక్ష్యంగా దాడులు చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. అధునాతన రక్షణ వ్యవస్థలను గందగరోళ పరచగల వివిధ రకాలుగా మారే క్షిపణులను దీనికి ఉపయోగించామని తెలిపింది. అలాగే , తాము అత్యంత అధునాతనమైన ఖైబర్-షేకెన్ బాలిస్టిక్ మిస్సైల్స్‌ను తొలిసారిగా ప్రయోగించినట్టు వెల్లడించింది. అన్ని విమానాలకు తమ గగనతలాన్ని మూసివేశామని, జోర్డార్, ఈజిప్ట్‌లతో ల్యాండ్ క్రాసింగ్ మాత్రమే తెరిచి ఉందని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ తాజా దాడులలో ఇరాన్ తన అతి పెద్ద పేలోడ్‌ను మోసుకెళ్లగల క్షిపణిని ఉపయోగించింది. ఖోర్రామ్‌షహర్-4 క్షిపణికి సంబంధించిన ఫైల్ ఫుటేజీని ఇరాన్ స్టేట్ టీవీ ప్రసారం చేసింది. నేటి దాడిలో దీనిని ప్రయోగించినట్టు తెలిపింది. ఖోర్రామ్‌షహర్ క్షిపణి పరిధి 2 వేల కిలోమీటర్లని, ఇది 1,500 కేజీల వార్ హెడ్ కలిగి ఉందని, ఇది బహుళ వార్హెడ్లను కూడా మోసుకెళ్లగలదని ఇరాన్ అధికారులు తెలిపారు.
దుబాయ్: ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడుల నేపథ్యంలో తమ దేశం లోపల, బయట గగనతలాన్ని మూసేస్తున్నట్టు ఇజ్రాయెల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆదివారం ప్రకటించింది. మూసివేత ఎంత కాలం కొనసాగుతుందో వెల్లడించలేదు.