రష్యా ఓ ఉగ్రవాద దేశమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇప్పుడు జరిగిన ప్రతి సంఘటనను గుర్తుంచుకుంటామని, రష్యాను క్షమించే పరిస్థితే లేదని తీవ్రంగా హెచ్చరించారు. ఫేస్బుక్ వేదికగా ఉక్రెయిన్ అధ్యక్షుడు ఓ వీడియోను రిలీజ్ చేశారు. రష్యా చేసిన అతిని తమ దేశ పౌరులు ఎంత మాత్రమూ మరిచిపోరని స్పష్టం చేశారు. క్షిపణుల ద్వారా రష్యా విరుచుకుపడుతోందని, ఈ దాడులో 16 మంది పసికూనలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలను చంపేసి, యుద్ధ తంత్రాన్ని మరిచిపోయారని, రష్యా అపరాధం చేసిందన్నారు. దీనికి తగ్గ రీతిలోనే తమ జవాబు ఉంటుందని జెలెన్స్కీ స్పష్టం చేశారు.
మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యురోపియన్ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈయూలో తమకు తాత్కాలిక సభ్యత్వం ఇవ్వాలని జెలెన్స్కీ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తాము తమ మాతృభూమి కోసం పోరాటం చేస్తున్నామని, తమ ప్రజలందరూ తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారని పేర్కొన్నారు. తాము ఉక్రెనియన్లమని, యుద్ధానికి భయపడే సమస్యే లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడి ఉపన్యాసం తర్వాత సభ్యులందరూ లేచి, కరతాళ ధ్వనులు చేశారు. రష్యా ఇంతలా విరుచుకుపడుతున్నా… తాము తగిన రీతిలో సమాధానం చెబుతున్నామని, భవిష్యత్ తరాల కోసమే తమ పోరాటమని జెలెన్స్కీ స్పష్టం చేశారు.