న్యూఢిల్లీ, నవంబర్ 28: వైట్ హౌస్ సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డు సిబ్బందిపై ఓ అఫ్ఘాన్ జాతీయుడు కాల్పులు జరిపిన నేపథ్యంలో అమెరికా వ్యవస్థ సంపూర్ణంగా కోలుకునేందుకు వీలుగా థర్డ్ వరల్డ్ దేశాలు (పేద దేశాలు) అన్నిటి నుంచి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించారు. ఈ చర్య ప్రపంచ దేశాలపైన ప్రతికూల ప్రభావం చూపడంతోపాటు ఉపాధి, విద్య కోసం, తమ దేశాలలో ఎదురవుతున్న వేధింపులను తప్పించుకునేందుకు అమెరికాకు వలసపోతున్న కోట్లాది మంది విదేశీయులపై తీవ్ర ప్రభావం చూపనున్నది.
తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ ద్వారా ఈ విషయాన్ని ట్రంప్ తెలియచేస్తూ సాంకేతికంగా అమెరికా పురోభివృద్ధి చెందినప్పటికీ దాని వలస విధానం ఆ ప్రయోజనాలను, అనేక మంది జీవన పరిస్థితులను దెబ్బతీసినట్లు పేర్కొన్నారు. అమెరికా వ్యవస్థ పూర్తిగా కోలుకునేందుకు మూడవ ప్రపంచ దేశాలు అన్నిటి నుంచి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తానని ఆయన ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో చట్టవ్యతిరేకంగా దేశంలోకి జరిగిన కోట్లాది మంది ప్రవేశాలను రద్దు చేస్తానని ఆయన తెలిపారు. అమెరికా అభివృద్ధికి పనికిరాని, తమ దేశాన్ని ప్రేమించడం చేతకాని ఎవరినైనా దేశం నుంచి పంపించివేస్తామని ఆయన హెచ్చరించారు.
తమ దేశ పౌరసత్వం లేని వారికి లభిస్తున్న ప్రభుత్వ ప్రయోజనాలు, సబ్సిడీలను నిలిపివేస్తామని, దేశంలో ప్రశాంతతకు భంగం కలిగించే వలసదారులకు పౌరసత్వాన్ని కల్పించబోమని, నేరాభియోగాలు, భద్రతాపరమైన ముప్పు, పాశ్చాత్య నాగరికతకు అనుగుణంగా వ్యవహరించని విదేశీ జాతీయులను వారి దేశాలకు పంపించివేస్తామని ట్రంప్ హెచ్చరించారు. రివర్స్ మైగ్రేషన్ ఒక్కటే ఈ పరిస్థితిని చక్కదిద్దగలదని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో నివసిస్తున్న విదేశీయుల జనాభా 5.30 కోట్లు ఉందని, వీరిలో అత్యధికులు విఫల దేశాలు లేదా జైళ్లు, మానసిక చికిత్సాలయాలు, నేర గ్యాంగులు, డ్రగ్స్ ముఠాలకు చెందిన వారని మరో పోస్టులో ట్రంప్ వ్యాఖ్యానించారు. వీరు, వీరి పిల్లలు దేశభక్తులైన అమెరికన్ పౌరులు చెల్లించే పన్నులతో బతుకుతున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు.
చారిత్రకంగా మొదటి ప్రపంచ దేశాలంటే అమెరికాతో సత్సంబంధాలు గల ప్రజాస్వామిక, పారిశ్రామికీకరణ చెందిన దేశాలు. ప్రధానంగా అమెరికా, దాని నాటో మిత్రులైన పశ్చిమ యూరోపియన్ దేశాలు, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు. ఇక రెండవ ప్రపంచ దేశాలంటే కార్మికులు, రైతుల పాలనలో ఉండే కమ్యూనిస్టు-సోషలిస్టు దేశాలు. ఈ రెండు కూటములకు చెందని దేశాలను మూడవ ప్రపంచ దేశాలుగా వ్యవహరిస్తారు. మొదటి ప్రపంచ దేశాలలో అమెరికా, పశ్చిమ యూరపు, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా తదితర దేశాలు ఉన్నాయి. అమెరికాతో సన్నిహిత సంబంధాలు గల అనేక ఆఫ్రికన్ దేశాలు కూడా మొదటి ప్రపంచ దేశాల పరిధిలోకి వస్తాయి. తటస్థ దేశాలైన స్విట్జర్లాండ్, స్వీడన్, ఆస్ట్రియా, ఫిన్లాండ్ కూడా ఈ కోవలోకే వస్తాయి. మూడవ ప్రపంచ దేశాలలో ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికావ్యాప్తంగా ప్రధానంగా అభివృద్ధి చెందని దేశాలు, వ్యవసాయ ఆధారిత దేశాలు ఉన్నాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందని దేశాలకు ప్రస్తుతం మూడవ ప్రపంచ దేశాలు అన్న పదం వర్తిస్తోంది.
మూడవ ప్రపంచ దేశాలంటే ఏవి అని ట్రంప్ వివరించనప్పటికీ ఆయన దృష్టిలో భారత్ ఏ క్యాటగిరీలో ఉందో ఎవరూ ఊహించలేరు. చారిత్రకంగా చూస్తే భారత్ మూడవ ప్రపంచ దేశాల జాబితాలోకి వస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితులలో వర్గీకరిస్తే ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగా అవతరించింది. జపాన్ ఆర్థిక వ్యవస్థను కూడా భారత్ ఇటీవలే అధిగమించింది.