రోమ్, జనవరి 9 : ఇటలీలోని బెల్కాస్ట్రో అనే పట్టణ మేయర్ వింత ఆదేశాలు జారీ చేశారు. పట్టణంలో అనారోగ్యానికి గురికావడం, ముఖ్యంగా అత్యవసర స్థితిని తెచ్చుకోవడం నిషేధం అంటూ మేయర్ అంటోనియో టార్చియా ఉత్తర్వులు ఇచ్చారు. ఇటలీలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న ఈ చిన్న పట్టణంలో 1,300 జనాభా నివసిస్తున్నారు. ఇందులో సగం మంది వృద్ధులే. అయితే, ఈ పట్టణంలో ప్రజలకు సరైన వైద్య సదుపాయాలు లేవు. గతంలో ఉన్న ఓ ఆరోగ్య కేంద్రం మూతబడింది. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించేందుకు వారాంతాలు, సెలవుల్లో వైద్యులు అందుబాటులో ఉండరు. దీంతో 45 కిలోమీటర్ల దూరంలోని కాటాన్జారో నగరానికి వెళ్లి వైద్యం పొందాలి. ఈ నేపథ్యంలోనే పట్టణంలో ఎవరూ అనారోగ్యానికి గురికావొద్దని ఉత్తర్వులు ఇచ్చినట్టు మేయర్ తెలిపారు. వైద్య సదుపాయాలు లేని అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ నిర్ణయమని చెప్పారు. పట్టణ ప్రజలు తరచూ ఇల్లు విడిచి బయటకు వెళ్లొద్దని, ప్రయాణాలు చేయవద్దని, క్రీడలు ఆడవద్దని, ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.