అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పీఠాన్ని డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధిష్ఠించబోతున్నారు. జనవరి 20న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ నినాదంతో ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్.. అమెరికన్లకు భారీగా హామీలు ఇచ్చారు. దేశంలో అనేక సంస్కరణలు తీసుకొస్తానని, ఆర్థిక, వలస విధానాలను మార్చేస్తానని చెప్పారు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని ప్రకటించారు. తాను బాధ్యతలు చేపట్టిన మొదటిరోజు నుంచే మార్పులు ఉంటాయని చెప్పారు. అమెరికాలో జరిగే మార్పుల ప్రభావం మిగతా ప్రపంచమంతటిపై పడుతుంది. దీంతో ట్రంప్ తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి, ఒకింత ఆందోళన వ్యక్తమవుతున్నాయి.
– నేషనల్ డెస్క్
Donald Trump | అక్రమ వలసదారులు వెనక్కు ట్రంప్ హయాంలో అమెరికా వలస విధానాలు మరింత కఠినతరం అయ్యే అవకాశం ఉంది. ఆయన ఎన్నికల ప్రచారం ప్రధానంగా వలస విధానంపైనే సాగింది. అక్రమంగా వలస వచ్చిన లక్షలాది మందిని సొంత దేశాలకు పంపించేస్తానని చెప్పారు. అమెరికాలో దాదాపు 1.10 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉంటున్నారని 2022లో గుర్తించారు. ఇందులో 7.25 లక్షల మంది భారతీయులు ఉంటారని అంచనా. వీరిని బలవంతంగా అమెరికా నుంచి పంపించే అవకాశం ఉంది.
అమెరికాలో జన్మించే ప్రతి బిడ్డకు జన్మహక్కుగా పౌరసత్వం వచ్చేది. ఈ బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ విధానాన్ని తొలగిస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో పౌరసత్వం లేకుండా అమెరికాలో స్థిరపడ్డ వారి పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం కాబోతున్నది. హెచ్1బీ వీసాలపై ఉన్న పరిమితులను మాత్రం తొలగించాలని ట్రంప్ శిబిరంలోని కొందరు ప్రతిపాదిస్తున్నారు. ఇది జరిగితే మాత్రం అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు చాలా ప్రయోజనం జరుగుతుంది. అయితే, ఈ ప్రతిపాదనలను కొందరు ట్రంప్ మద్దతుదారులే వ్యతిరేకిస్తున్నారు.
తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన 24 గంటల్లో రష్యా – ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు.త్వరలో పుతిన్‌తో సమావేశమై యుద్ధాన్ని ఆపడం కోసం చర్చలు జరుపుతానని సైతం ట్రంప్ ఇటీవల ప్రకటించారు. ఇదే జరిగితే ప్రపంచంలో నెలకొన్న కల్లోలం కొంత కుదుటపడటంతో పాటు ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరా భారం అమెరికాకు తగ్గుతుంది.
అమెరికా నుంచి ఎగుమతి చేసే వస్తువులపై ఇతర దేశాలు భారీగా సుంకాలు వేస్తున్నాయని, తాను గెలిస్తే ప్రతీకార సుంకాలు వేస్తానని డొనాల్డ్ ట్రంప్ అనేకసార్లు ప్రకటించారు. తమ దేశ ఉత్పత్తులకు ఎక్కువ సుంకాలు వసూలు చేస్తున్న దేశాల ఉత్పత్తులపై తామూ పన్నులు వేస్తామని ఆయన ప్రకటించారు. దీంతో భారత్ సహా వివిధ దేశాల నుంచి అయ్యే ఎగుమతులపై ప్రభావం ఉండొచ్చు.
చైనా ఉత్పత్తులపై డొనాల్డ్ ట్రంప్ కఠిన వైఖరి అవలంబించే అవకాశం ఉంది. తన ఎన్నికల ప్రచారంలో అనేకసార్లు ఈ విషయంలో ట్రంప్ ఆలోచన బయటపడింది. చైనా తయారీ దిగుమతులపై సుంకాలు, పరిమితులు విధించవచ్చు. ఇదే జరిగితే చైనాలోని పరిశ్రమలు భారత్, ఇండోనేషియా, వియత్నాం వంటి దేశాలకు వెళ్తాయని, తద్వారా ఈ దేశాల్లో తయారీరంగం పుంజుకుంటుందని సైతం పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటానని ట్రంప్ చెప్తున్న ఆర్థిక విధానాల వల్ల అమెరికా డాలర్ మరింత బలపడవచ్చు. డాలర్ విలువ బలపడితే మిగతా దేశాల్లో ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. భారత్‌పైనా ఈ ప్రభావం ఉండొచ్చు. ముఖ్యంగా భారత్ చేసుకునే చమురు దిగుమతుల ఖర్చు పెరగొచ్చు.
2030 నాటికి అమెరికాలో విక్రయించే కొత్త కార్లు, ట్రక్కుల్లో 50 శాతం విద్యుత్తువే అయి ఉండాలని బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని రద్దు చేస్తానని ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయం ప్రపంచంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలకు ఎదురుదెబ్బ కావొచ్చని పర్యావరణవేత్తలు భావిస్తున్నారు. అమెరికాలో చమురు తవ్వకాన్ని సైతం భారీగా పెంచుతానని సైతం ట్రంప్ చెప్పారు. ఈ నిర్ణయమూ కాలుష్యానికి నష్టమే. అయితే, అమెరికాలో చమురు ఉత్పత్తి పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు డిమాండ్ తగ్గి, ధరలు తగ్గే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.