శుక్రవారం 15 జనవరి 2021
International - Dec 27, 2020 , 16:53:56

తదుపరి దలైలామా ఎవరు?

తదుపరి దలైలామా ఎవరు?

అమెరికాలో విదేశాంగ విధాన పండితులు కాబోయే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. చైనా పట్ల ఏ విధమైన విధానాలు, వ్యూహాలను అవలంబించాలనే దానిపై విభేదిస్తున్నప్పటికీ.. ఇన్‌కమింగ్ ప్రెసిడెండ్‌కు చైనా అతిపెద్ద విదేశాంగ విధాన సవాలును సూచిస్తుందనే దానిని మాత్రం ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నారు. అమెరికా-చైనా సంబంధాలలో చాలా చికాకులు ఉన్నప్పటికీ.. త్వరలో ఓ ముఖ్య సమస్య తదుపరి అధ్యక్ష పదవిలో మంటలు చెలరేగే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తున్నది. అదే తదుపరి దలైలామా ఎంపిక.. 14 వ దలైలామాకు వారసుడి ఎంపిక టిబెటన్ ప్రజలతోనే ఉండాలని, టిబెట్‌పై చైనా ఆంక్షలు విధించరాదని అమెరికా చట్టసభ సభ్యులు తమ దేశం స్థితిని పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో తదుపరి దలైలామా ఎంపిక అమెరికా అధ్యక్షుడికి ఇబ్బందికరంగా పరిణమించే పరిస్థితులు కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

దలైలామా.. ఏమిటా కథ..?

దలైలామా.. టిబెట్‌‌లోని గెలుగ్ శాఖకు చెందిన బౌద్ధుల ఆచార్య పదవి పేరు. టిబెట్‌లోని సాంప్రదాయిక బౌద్ధ శాఖల్లో ఇది అత్యంత నవీనమైనది. ప్రస్తుత దలైలామా.. దలైలామాల పరంపరలో 14 వ వారు. భారతదేశంలో శరణార్థిగా ఉంటున్నారు. అతడి అసలు పేరు టెన్జిన్ గ్యాట్సో. దలైలామాను తుల్కస్ శ్రేణిలో ఒకరిగా పరిగణిస్తారు. తుల్కస్ అంటే కారుణ్య బోధిసత్వుడైన అవలోకితేశ్వరుడి అవతారం. తొలి దలైలామా 1391 నుంచి 1474 వరకు జీవించారు. ఇప్పటివరకు 14 మంది దలైలామాలుగా నియమితులయ్యారు. 14వ దలైలామా అని పిలుచుకునే టెన్జిన్‌ గ్యాట్సో 1935 లో జన్మించగా.. 1939లో దలైలామాగా గుర్తించారు. 

1642 నుంచి 1705 వరకు, తిరిగి 1750 నుంచి 1950 వరకు.. దలైలామాలు లేదా వారి ప్రతినిధులు లాసాలోని టిబెటన్ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. 1913 లో అగ్వాన్ డోర్జీవ్‌తో పాటు పలు టిబెటన్ ప్రతినిధులు టిబెట్, మంగోలియా మధ్య ఒక ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ద్వారా పరస్పర గుర్తింపును చైనా నుంచి తమ స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నారు. అయితే ఈ ఒప్పందం చట్టబద్ధతను, టిబెట్ స్వాతంత్ర్యాన్ని రిపబ్లిక్ ఆఫ్ చైనా, ప్రస్తుత పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా.. రెండూ తిరస్కరించాయి. అయినప్పటికీ, 1951 వరకు దలైలామాలే టిబెటన్ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు.

ఆశయమిచ్చిన నెహ్రూ

13 వ దలైలామా.. 1933 డిసెంబర్ 17 న టిబెటన్ రాజధాని లాసాలో మరణించారు. ఆచారం ప్రకారం, తదుపరి దలైలామాగా మారే పిల్లవాడిని గుర్తించడానికి శోధన పార్టీలను పంపారు. ఈశాన్య టిబెట్‌లో నివసిస్తున్న ఓ యువకుడు అన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉండటంతో తదుపరి దలైలామాగా ప్రకటించారు. దాంతో అతడు 1940 ఫిబ్రవరి 22 న లాసాలో సింహాసనం పొందాడు. ఇది జరిగిన దశాబ్ద కాలం తరువాత టిబెట్ తమ దేశంలో భాగమని చైనా కమ్యూనిస్టులు ప్రకటించారు. టిబెట్‌లో హింసాత్మక ఘర్షణలు జరుగడంతో వచ్చిన ఒత్తిడిల మేరకు 1951 మే నెలలో, టిబెట్ ప్రతినిధి బృందం టిబెట్ నియంత్రణను చైనాకు అప్పగించింది. అప్పటి నుంచి టిబెటన్ల స్ఫూర్తిని అణిచివేసే చర్యలను చైనా ప్రారంభించింది. దాంతో 1959 మార్చి నెలలో.. 14 వ దలైలామా హిమాలయాల మీదుగా చిన్న బృందంతో నాటకీయంగా తప్పించుకొని భారతదేశానికి చేరుకున్నారు. ఆ రోజుల్లో దలైలామాకు జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం ఆశ్రయం ఇచ్చింది. ఆరోజు నుంచి హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాల పట్టణానికి ఎగువ ప్రాంతంలో ప్రవాసంలో నివసిస్తున్నారు. దలైలామాను టిబెట్ రక్షకుడు అవలోకితేశ్వర, కరుణ యొక్క బోధిసత్వుని మానవ స్వరూపులుగా భావిస్తారు.

అప్పుడు.. ఇప్పుడు చైనానే!

1995 లో పంచన్ లామా వారసుడి కోసం ఎంపిక చేసిన బాలుడు కనిపించకుండా పోయాడు. పంచన్ లామా టిబెట్‌లో రెండవ అతి ముఖ్యమైన మత వ్యక్తిగా గుర్తిస్తారు. అప్పుడు చైనా ప్రభుత్వం తమ సొంత పంచన్ లామాను నియమించగా.. అదే చైనా ఇప్పుడు సొంతంగా దలైలామాను నియమించాలని యోచిస్తున్నదనే భయాలున్నాయి. తరువాతి దలైలామా ఎవరు అన్న విషయంలో సాంప్రదాయాన్ని కొనసాగించాలని చైనా పట్టుబడుతుండగా.. టిబెటన్లు మాత్రం చైనా చేస్తున్న ఒత్తిడిని వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంపై దలైలామా మాట్లాడుతూ .. 'తదుపరి దలైలామా ఎవరనే దానిపై బయట ఇప్పటికే చాలా చర్చ జరిగింది. ఈ విషయంపై అంత తొందర ఎందుకు? ప్రస్తుతం నాకు 85 ఏండ్లు. నేను పూర్తి ఆరోగ్యంగానే ఉన్నాను. ఇప్పుడే తదుపరి దలైలామా ఎవరు అన్న దానిపై చర్చ అవసరమా?' అంటూ చమత్కరించారు.

నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన దలైలామా 1959లో భారతదేశానికి శరణార్థిగా వచ్చారు. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని కొండ ప్రాంతమైన ధర్మశాలలో ఆనివాసముంటున్నారు. కానీ చైనా మాత్రం దలైలామాను టిబెట్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న వ్యక్తిగా గుర్తిస్తున్నది. 1970 ల మధ్యలో, దలైలామా ఒక పోలిష్ వార్తాపత్రికతో మాట్లాడుతూ.. తానే చివరి దలైలామా అని అనుకుంటున్నట్లు చెప్పడం టిబెటన్లలో కలకలం రేపిందని చెప్పవచ్చు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.