రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ కసాయి అంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై వైట్‌హౌజ్ వివరణ ఇచ్చింది. తమ ఉద్దేశం అది కాదంటూ పేర్కొంది. ఇక పుతిన్ అధికారంలో ఉండడన్న వ్యాఖ్యల వెనుక ఎలాంటి ఉద్దేశాలు లేవని తేల్చి చెప్పింది. రష్యాలో ప్రభుత్వ మార్పు, ప్రభుత్వాన్ని దించడం గురించి బైడెన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని వైట్ హౌజ్ అధికారులు స్పష్టం చేశారు. పొరుగు దేశాలపై తమ అధికారాన్ని ఉపయోగించడం బైడెన్ అభిప్రాయం ఎంత మాత్రమూ కాదని వైట్‌హౌజ్ అధికారులు వివరణ ఇచ్చారు.
ఉక్రెయిన్ పొరుగు దేశమైన పోలండ్ పర్యటనకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెజ్ డుడాతో పాటు ఉక్రెయిన్ రక్షణ, విదేశాంగ శాఖ మంత్రులను వేర్వేరుగా కలిశారు. ఉక్రెయిన్‌కు ఆయుధ సామగ్రి చేరవేత, ఇతర భద్రతా హామీలపై ఆండ్రెజ్‌తో చర్చించారని వైట్‌హౌస్ తెలిపింది. వార్సాలో ఉక్రెయిన్ శరణార్థులతో బైడెన్ మాట్లాడుతూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఒక ‘కసాయి’గా అభివర్ణించారు. ఈ నేపథ్యంలోనే వైట్‌హౌజ్ పై విధంగా వివరణ ఇచ్చింది.