న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉన్నది. దేశాధ్యక్షుడి ఆరోగ్యం అద్భుతంగా ఉన్నట్లు వైట్‌హౌజ్ ఫిజీషియన్ డాక్టర్ కెప్టెన్ సీన్ బార్బాబెల్లా తెలిపారు. 79 ఏళ్ల ట్రంప్ గుండె, ఉదరం నార్మల్‌గా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అక్టోబర్ నెలలో జరిగే వైద్య పరీక్షలో ట్రంప్‌కు ఎంఆర్ఐ నిర్వహించినట్లు వైట్‌హౌజ్ ఫిజీషియన్ తెలిపారు. ట్రంప్ వయసున్న వ్యక్తుల్లో కార్డియో, ఉదర ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని, ఆ కారణంగా ఆయనకు పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ చెప్పారు.
ఇటీవల ట్రంప్ ఆరోగ్యంపై డెమోక్రాట్లు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో తాజా ఫలితాలను రిలీజ్ చేశారు. ట్రంప్ స్కాన్ నివేదికను రిలీజ్ చేయాలని మిన్నసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ డిమాండ్ చేశారు. రెండోసారి దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ఆరోగ్యంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. గుండె పనితీరు భేషుగ్గా ఉందని, ధమనుల్లో రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతోందని, ఎటువంటి వైపరీత్యాలు లేవని, అధ్యక్షుడి గుండె బలంగానే ఉన్నట్లు వైట్‌హౌజ్ ఫిజీషియన్ తన నివేదికలో తెలిపారు. ట్రంప్ కార్డియోవాస్కులార్ సిస్టమ్ అద్భుతంగా పనిచేస్తున్నట్లు చెప్పారు.
అక్టోబర్‌లో జరిగిన స్కానింగ్ నివేదికలను రిలీజ్ చేయాలని కొందరు డెమోక్రాట్లు డిమాండ్ చేశారు. అయితే ఇటీవల ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ప్రయాణిస్తూ ఆ ఫలితాలను వెల్లడించడానికి తనకేమీ అభ్యంతరం లేదన్నారు. ఓ రిపోర్టర్ ప్రశ్నిస్తూ శరీరంలోని ఏ భాగానికి ఎంఆర్ఐ చేశారని అడిగారు. దానికి ట్రంప్ బదులిస్తూ.. దేని గురించి తెలియదని, కానీ ఎంఆర్ఐ చేశారని, ఏ భాగానికి అంటే, అది మాత్రం బ్రెయిన్ కోసం కాదన్నారు. ఎందుకంటే తనకు జ్ఞాపకశక్తి పరీక్ష నిర్వహించారని, దాంట్లో ఫస్ట్ వచ్చినట్లు ట్రంప్ వెల్లడించారు.