లండన్: 70 ఏళ్లకు పైగా బ్రిటీష్ సామ్రాజ్యాన్ని పాలించారు క్వీన్ ఎలిజబెత్-2. నాణాలపై, స్టాంపులపై, పాస్‌పోర్ట్‌లపై ఆ క్వీన్ బొమ్మే కనబడేది. ఇప్పుడు ఆమె అస్తమించారు. మరి ఆ నాణాలు, పాస్‌పోర్ట్‌లపై ఎవరి ముద్ర ఉంటుంది. ఆ పాత నాణాలు, స్టాంపులు ఏం కావాలి. దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం. ప్రస్తుతం క్వీన్ తల ముద్రతో ఉన్న సుమారు 29 బిలియన్ల కాయిన్స్ చెలామణిలో ఉన్నాయి. 2015లో క్వీన్ 88 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కూడా కొత్త నాణాలను రిలీజ్ చేశారు. కొత్త రాజు చార్లెస్-3 పేరుతో ఎప్పుడు కొత్త నాణాలను జారీ చేస్తారో రాయల్ మింట్ ఇంకా చెప్పలేదు. కానీ క్వీన్ కాయిన్స్ మాత్రం చాన్నాళ్ల పాటు చెలామణిలో ఉండనున్నట్లు తెలుస్తోంది.
బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ నోట్లపై క్వీన్ బొమ్మ ఉంటుంది. 1960 నుంచి ఈ సంప్రదాయ కొనసాగుతోంది. కానీ స్కాటిష్,నార్త్ ఐరిష్ బ్యాంకు నోట్లపై మాత్రం ఆ రాణి బొమ్మ ఉండదు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ఇప్పటి వరకు 4.5 బిలియన్ల క్వీన్ బొమ్మతో ఉన్న నోట్లను జారీ చేసింది. దాదాపు 80 బిలియన్ల డాలర్ల ఖరీదైన కరెన్సీ ప్రస్తుతం వాడకంలో ఉంది. నాణాల తరహాలోనే కరెన్సీని కూడా దశలవారీగా తొలగిస్తారు.
1967 నుంచి రాయల్ మెయిల్ జారీ చేస్తున్న స్టాంపులపై క్వీన్ ఎలిజబెత్ సైడ్ ప్రొఫైల్ ఉంటుంది. ఇక నుంచి అలాంటి స్టాంపులను విడుదల చేయడాన్ని రాయల్ మెయిల్ ఆపేయనున్నది. క్రమంగా వీటిని తొలగిస్తారు. కెచప్‌లు, పప్పుదినుసులు, పర్ఫ్యూమ్లు ఇలాంటి వస్తువులకు చెందిన ప్యాకెట్లపై ఉండే రాయల్ ఆర్మ్స్ ముద్రను ఇక నుంచి నిలిపివేయనున్నారు. రాణి పేరుమీదనే అన్ని బ్రిటీష్ పాస్‌పోర్టులను జారీ చేస్తారు. ప్రస్తుతం ఆ పాస్‌పోర్ట్‌లను ట్రావెల్ కోసం వాడవచ్చు. కానీ హర్ మెజస్టీ అన్న స్థానంలో ఇక నుంచి హిజ్ మెజస్టీ అని మార్చాల్సి ఉంటుంది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ పోలీసులు తమ హెల్మట్లోని క్వీన్ బొమ్మను మార్చాల్సి ఉంటుంది. జాతీయ గీతంలోని గాడ్ సేవ్ ద క్వీన్ అన్న పదాల్ని కూడా మార్చనున్నారు. చార్లెస్‌ను రాజుగా ప్రకటించిన తర్వాత గాడ్ సేవ్ ద కింగ్ అని రాయనున్నారు.