రోమ్ : ఇటలీలోని సంపన్నులు బోస్నియా (Bosnia) రాజధాని సరాజెవో వీధుల్లో నాడు చేసిన అరాచకాలు మనసును కలచివేస్తున్నాయి. వీరి ఆగడాలపై దర్యాప్తు జరపాలని ఇటలీ ప్రభుత్వం నిర్ణయించింది. బోస్నియా-హర్జెగోవినాను గణతంత్ర ప్రాంతంగా అంతర్జాతీయ సమాజం 1992లో గుర్తించింది. దీనిని బోస్నియా సెర్బ్స్ వ్యతిరేకించారు. బోస్నియా రాజధాని సరాజెవో నగరాన్ని బోస్నియా సెర్బ్స్ దళాలు ఆక్రమించుకున్నాయి. 1992-1995 మధ్య కాలంలో జరిగిన ఈ యుద్ధంలో సుమారు 11 వేల మంది మరణించారు.
అయితే ఈ యుద్ధంలో ఇటలీ సంపన్నులు పాల్పడిన అరాచకాలపై తాజా నివేదిక దిగ్భ్రాంతికర వాస్తవాన్ని ఇటీవల వెల్లడించింది. ఈ యుద్ధం వల్ల బోస్నియా ప్రజల కష్టాలను ఆసరాగా చేసుకుని ఇటలీలోని సంపన్నులు ఇక్కడికి స్నైపర్ టూరిజం కోసం వచ్చేవారు. సరాజెవో నగర వీధుల్లో సామాన్యులను స్నైపర్ తుపాకులతో వేటాడటమే ఈ పర్యాటకం ముఖ్య ఉద్దేశం. బోస్నియా సెర్బ్స్ దళాలు వీరికి అన్ని విధాలుగా సహకరించేవి. ఈ సంపన్నులను కొండల ప్రాంతాలకు తీసుకెళ్లేవి. ఒక్కొక్కరిని వేటాడి, చంపడానికి సంపన్నులు రూ.1 కోటి వరకు చెల్లించేవారు. చిన్నారులను చంపడానికి ఎక్కువ మొత్తం చెల్లించేవారు. వృద్ధులను ఉచితంగానే వేటాడి, చంపడానికి ఈ దళాలు అనుమతించేవి.