టోక్యో, అక్టోబర్ 5: ఆయనో కోటీశ్వరుడు. నెలకు రూ.లక్షల్లో అద్దెలు తెచ్చే ఏడు ఫ్లాట్లు ఉన్నాయి. షేర్లలో పెట్టుబడులు, బ్యాంకులో డిపాజిట్లు కూడా భారీగానే ఉన్నాయి. ఇన్ని ఉన్నా ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పని చేయడం మాత్రం ఆయన ఆపలేదు. 56 ఏళ్ల కోయిచి మత్సుబరా అనే జపాన్ జాతీయుడికి ఏడాదికి కేవలం ఇళ్ల అద్దె రూపంలోనే రూ. 1.83 కోట్ల ఆదాయం లభిస్తుంది. ఇవిగాక పెట్టుబడులపైన వడ్డీ అదనం.
ఇంత ఆస్తిపరుడైనా అతను మాత్రం ఓ ఆపార్ట్మెంట్లో పార్ట్ టైమ్ వాచ్మెన్గా పనిచేయడం విశేషం. భవనం ప్రాంగణాన్ని శుభ్రం చేయడం, మౌలిక వసతులను చూసుకోవడం వంటి పనులు చేస్తుంటాడు. రోజుకు నాలుగు గంటల షిఫ్టులో(వారానికి 3 రోజులు) పనిచేయడం ద్వారా నెలకు 1 లక్ష ఎన్లు(సుమారు రూ.60,354) సంపాదిస్తున్నాడు. నిరాడంబరంగా జీవించడమే తనకు ఇష్టమని, చురుకుగా, ఆరోగ్యంగా ఉండేందుకే తాను వాచ్మెన్గా పనిచేస్తున్నానని అతను తెలిపాడు. అనవసర హంగూ ఆర్భాటాలకు తాను దూరంగా ఉంటానని కూడా అతను చెప్పాడు. మత్సుబరా పనిచేస్తున్న అపార్ట్మెంట్లో అతనే అందరికన్నా ధనికుడు కావడం గమనార్హం.