Vladimir Putin : రష్యా-ఉక్రెయిన్ (Ukraine-Russia) దేశాల మధ్య కొన్ని గంటల్లో శాంతి చర్చలు మొదలుకానున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఉక్రెయిన్ సైన్యంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ దేశం ప్రజలను బలవంతంగా సైన్యంలో చేరుస్తోందని ఆరోపించారు. బిజినెస్ రష్యా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని స్పుత్నిక్ న్యూస్ తన కథనంలో వెల్లడించింది.
బిజినెస్ రష్యా ఆర్గనైజేషన్ సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ తన దేశంలో పౌరులను బలవంతంగా సైన్యంలో చేర్చుకుంటోందని, రష్యాలో మాత్రం యుద్ధంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్న వాలంటీర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోందని చెప్పారు. తమ సైన్యం భయపెట్టడం కంటే స్వచ్ఛందంగా చేర్చుకోవడాన్నే నమ్ముతుందని అన్నారు. ఉక్రెయిన్ యువతలో సైన్యంలో చేరాలన్న ఉత్సాహం ఏమాత్రం లేదని, కానీ రష్యన్స్ మాత్రం మిలిటరీపై ఆసక్తి చూపుతున్నారని చెప్పారు.
ఉక్రెయిన్లో ప్రజలను వీధి శునకాల వలే పట్టుకొని బస్సుల్లో ఈడ్చుకెళ్తున్నారని పుతిన్ అన్నారు. ఇప్పటివరకు ఇలా 30 వేల మందిని తీసుకెళ్లారని చెప్పారు. కానీ రష్యాలో అలా కాదని, పౌరులే స్వచ్ఛందంగా వస్తారని తెలిపారు. ఇప్పటివరకు అలా దాదాపు 60 వేల మంది ముందుకొచ్చినట్లు వెల్లడించారు. కాగా, ఇటీవల ఉక్రెయిన్లో సైనిక నియామకాలు వివాదంగా మారాయి. పౌరులను పోలీసులు వెంటాడి తీసుకెళ్తున్నారు. ఈ నియామకాలను బసిఫికేషన్గా వ్యవహరిస్తారు. బస్సుల్లో ఎక్కించి తరలిస్తుండటంతో దీనికి ఆ పేరు వచ్చినట్టు తెలుస్తోంది.