బీజింగ్: షాంఘైలో విధించిన కోవిడ్ ఆంక్షలతో జనం చిర్రెక్కుతున్నారు. కఠిన నియమావళి వల్ల బిల్డింగ్‌లను వదిలి జనం రావడం లేదు. దీంతో అక్కడి నివాసితులు అరుపులు, కేకలతో ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు తాజాగా ట్విట్టర్, ఇన్‌స్టాలో వైరల్ అవుతున్నాయి. తీవ్ర పరిణామాలు తప్పవన్న రీతిలో బిల్డింగ్‌లో ఉన్న జనం వార్నింగ్ కూడా ఇస్తున్నారు. చైనాలో పెద్ద నగరమైన షాంఘైలో ఏప్రిల్ 5వ తేదీ నుంచి కఠిన లాక్డౌన్ అమలు చేస్తున్నారు. కోవిడ్ వ్యాప్తిని అరికట్టే ఉద్దేశంతో.. జనం బయటకు రాకుండా బిల్డింగ్‌ల్లోనూ ఉండేలా చేస్తున్నారు. సుమారు 2.6 కోట్ల మంది స్టేట్ ఎట్ హోమ్ ఆదేశాలను పాటిస్తున్నారు.
Residents in #Shanghai screaming from high rise apartments after 7 straight days of the city lockdown. The narrator worries that there will be major problems. (in Shanghainese dialect—he predicts people can’t hold out much longer—he implies tragedy).pic.twitter.com/jsQt6IdQNh
— Eric Feigl-Ding (@DrEricDing) April 10, 2022
షాంఘైలో జరుగుతున్న పరిణామాలపై అమెరికా డాక్టర్ ఎరిక్ ఫీగల్ డింగ్ కొన్ని వీడియోలు పోస్టు చేశారు. బిల్డింగ్‌లో ఉన్న జనం గట్టిగా అరుస్తున్న వీడియోలను ఆయన ట్వీట్ చేశారు. షాంఘైనీస్ భాషలో జనం అరుస్తున్నారని, వాళ్లను ఇలా బంధించడం సరికాదు అని, ఇది తీవ్ర విషాదానికి దారి తీస్తుందని ఆయన తన ట్వీట్లో హెచ్చరించారు. ప్రస్తుతం చైనాలో ఒమిక్రాన్ బీఏ.2 వేరియంట్ వ్యాప్తి చెందుతోందని, షాంఘైలో ఆ వేరియంట్ తీవ్ర దశకు చేరుకున్నట్లు ఓ నిపుణుడు తెలిపారు. ఆదివారం షాంఘైలో 25వేల మందికి కరోనా పాజిటివ్‌గా వచ్చింది.