టొరంటో: కెనడాలోకి ఒక స్టోర్ ముందు వందలాది మంది విద్యార్థులు క్యూ కట్టిన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వారంతా భారత్‌కు చెందిన విద్యార్థులే. పార్ట్ టైం ఉద్యోగం కోసం టొరంటోలో కాఫీ, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ అయిన టిమ్ హార్టన్స్ ఔట్లెట్ ముందు భారీగా బారులు తీరారు. ఈ దృశ్యం చూస్తే చాలు భారత్ విద్యార్థులు పార్ట్‌టైం ఉద్యోగం కోసం కెనడాలో ఎన్ని పాట్లు పడుతున్నారో అర్థం కావడానికి. ఉన్న ఒకటి, రెండు పార్ట్ టైం ఉద్యోగాల కోసం ఇంతమంది రావడం స్థానికులను కూడా ఆశ్చర్యపరిచింది. ఇంత మందిని చూసి కంగారు పడిన ఆ ఔట్లెట్ నిర్వాహకులు విద్యార్థుల నుంచి రెజ్యూమ్‌లు తీసుకుని, తర్వాత ఇంటర్వ్యూకు పిలుస్తామని చెప్పి పంపేశారు. అసలే నిరుద్యోగ సమస్యతో అల్లాడుతున్న కెనడాలో మన విద్యార్థులకు పార్ట్ టైం ఉద్యోగం దొరకడం దుర్లభంగా మారింది. ఒక జాబ్ కోసం ఇంతమంది పోటీపడితే జాబ్ మార్కెట్ క్రాష్ కావడం ఖాయమని, అప్పుడు మీరు బీహార్‌లో కన్నా తక్కువ జీతానికి ఇక్కడ పనిచేయక తప్పదని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు.
వాషింగ్టన్: అమెరికాను వరదలు వణికిస్తున్నాయి. మిన్నెసోటా, బ్లూ ఎర్త్ కౌంటీలో ఉన్న ది ర్యాపిడాన్ డ్యామ్ తునాతునకలైంది. దీంతో అయోవా, సౌత్ డకోటా, మిన్నెసోటా, నెబ్రోస్కా రాష్ర్టాల్లో సుమారు 30 లక్షల మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దాదాపు 11 వేల మంది నివసిస్తున్న స్పెన్సర్ సిటీ, క్లే కౌంటీలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. సియోక్స్ నగర ఫైర్ మార్షల్ మాట్లాడుతూ, ఇంత పెద్ద ఎత్తున వరదలు వస్తాయని తాము ఊహించలేదని చెప్పారు. అయోవా గవర్నర్ కిమ్ రేనాల్డ్స్ స్పందిస్తూ, ప్రస్తుత దుస్థితిని చూస్తూ ఉంటే, 1993నాటి భయానక వరదలు గుర్తుకొస్తున్నాయన్నారు.
గ్యాంగ్‌టక్: ఇండియన్ ఫుట్‌బాల్ ఐకాన్ భైచుంగ్ భూటియా రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఇటీవల జరిగిన సిక్కిం శాసనసభ ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు. భూటియా 2014లో రాజకీయాల్లో ప్రవేశించారు. తాజా పరాజయంతో ఆయన మొత్తం ఆరుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఎన్నికల రాజకీయాలు తనకు తగినవి కాదని తెలిసివచ్చిందని, తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని ప్రకటించారు.